ఉపాధికి నిబంధనాలు | - | Sakshi
Sakshi News home page

ఉపాధికి నిబంధనాలు

Mar 11 2025 12:19 AM | Updated on Mar 11 2025 12:20 AM

● కొత్త జాబ్‌కార్డుల జారీని తాత్కాలికంగా నిలిపివేసిన ప్రభుత్వం ● జాబ్‌కార్డు లేక ఉపాధికి దూరమవుతున్న కూలీలు ● ‘ఆత్మీయ భరోసా’తో గ్రామాల్లో పెరిగిన డిమాండ్‌

రెబ్బెన(ఆసిఫాబాద్‌): రాష్ట్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో కొత్త జాబ్‌కార్డుల మంజూరులో విధించిన నిబంధనలు కొత్త కూలీల పాలిట శాపంగా మారింది. కొన్ని నెలలుగా కొత్తగా కార్డులు జారీని నిలిపివేయడంతో అర్హులకు ఉపాధి దక్కడం లేదు. ఉపాధిహామీ చట్టం ప్రకారం ఆసక్తి చూపే ప్రతీ కూలీకి తప్పనిసరిగా పనులు కల్పించాల్సిందే. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు చట్టానికే తూట్లు పొడుస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి.

వేసవిలో ఉపాధి పనులే దిక్కు..

జిల్లా ప్రజలకు ఉపాధి అవకాశాలు అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రజలంతా వ్యవసాయంపైనే ఆధారపడుతున్నారు. జనవరి నాటికే వానాకాలం పంటల సీజన్‌ పూర్తవుతుంది. వ్యవసాయ కూలీలు, భూమి లేని నిరుపేదలకు ఉపాధిహామీ పనులే దిక్కుగా మారుతాయి. జనవరి నుంచి జూన్‌ వరకు కొనసాగే ఉపాధిహామీ పనులు వేసవిలో కూలీలకు బాసటగా నిలుస్తున్నాయి. ఈజీఎస్‌ కింద కూలీలకు చెల్లించే రోజువారి కూలి సైతం పెరగడంతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏటా జిల్లాలో ఉపాధిహామీ పనులు చేసే కూలీల సంఖ్య సైతం పెరుగుతోంది. జిల్లాలో మంజూరైన జాబ్‌కార్డులకు, పనిచేసే కూలీల సంఖ్యకు పొంతన ఉండటం లేదు. అధికారులు జిల్లాలో 1,23,035 జాబ్‌కార్డులను మంజూరు చేయగా, ప్రస్తుతం కేవలం 91,721 జాబ్‌కార్డులు మాత్రమే యాక్టివ్‌లో ఉన్నాయి. 2,43,969 మంది కూలీలు ఉండగా 1,70,268 మంది మాత్రమే పనులకు వెళ్తున్నారు.

పెరిగిన డిమాండ్‌

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా భూమి లేని నిరుపేదలకు ఏడాదికి రూ.12వేలు ఆర్థికసాయం అందించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంగా నామకరణం చేసి భూమి లేని నిరుపేదలకు ఆర్థికసాయం అందించేందుకు కసరత్తు ప్రారంభించింది. అయితే పేదలను గుర్తించేందుకు ఉపాధిహామీ పథకంలో ఏడాదిలో కనీసం 20 రోజులపాటు పనిచేయాలని నిబంధన విధించారు. జనవరిలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి లబ్ధిదారులకు రూ.6వేల నగదు అందించింది. దీంతో ఉపాధిహామీ పనులు చేసే కూలీలకే ఆత్మీయ భరోసా పథకం వర్తిస్తుందనే భావనతో గ్రామీణ ప్రాంత ప్రజలు పనుల కోసం దరఖాస్తులు అందిస్తున్నారు. భూములు ఉన్న రైతులు సైతం కొత్తగా జాబ్‌కార్డుల కోసం ఆసక్తి చూపుతున్నారు. ఈజీఎస్‌ అధికారులు కొత్త జాబ్‌కార్డుల మంజూరుకు ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంతో దరఖాస్తులు స్వీకరించి దగ్గర పెట్టుకుంటున్నారు. మరోవైపు ఇప్పటికే జాబ్‌కార్డులు ఉన్న కూలీలు పూర్తిస్థాయిలో పనులకు రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. గతంలో స్వచ్ఛ భారత్‌ మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలను కూడా జాబ్‌కార్డులు ఉన్న వారికి మాత్రమే మంజూరు చేశారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం పూర్తయి బిల్లులు తీసుకున్న వారు జాబ్‌కార్డులను పక్కన పడేశారు. రైతులు సైతం వ్యవసాయ భూముల్లో పనుల కోసం జాబ్‌కార్డులు తీసుకుని పనులు చేయించుకుంటున్నారు. ఆ తర్వాత పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోవడంతో పనిచేసే కూలీల సంఖ్య తగ్గుతోంది. ఇప్పుడు కొత్త జాబ్‌కార్డుల మంజూరు, మార్పులు చేర్పులపై ఆంక్షలు విధించడంతో కొత్తగా పని చేసేందుకు ఇష్టపడుతున్న కూలీలపై ప్రభావం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు జాబ్‌కార్డులు మంజూరు చేసి పనులు కల్పించేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

విచారణ తర్వాతే జారీ

ఉపాధిహామీ పనులు చేసేందుకు జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే తప్పకుండా జారీ చేస్తాం. కానీ ఆత్మీయ భరోసా పథకం వర్తించాలనే కోరికతో జాబ్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే.. అ లాంటి వాటిని విచారణ చేపడతాం. ప్రభుత్వం ఉ పాధిహామీ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తుండటంతో కొత్త జాబ్‌కార్డు ల కోసం చాలామంది దరఖాస్తులు చేసుకుంటున్నారు. అర్హత ఉంటేనే కొత్త జాబ్‌కార్డు ఇస్తున్నాం.

– దత్తారావు, డీఆర్‌డీవో

నిలిచిన కొత్త కార్డుల జారీ

వేసవిలో చేసేందుకు పనులు లేక ఉపాధి కోసం ఆరాటపడే కూలీలకు ఉపాధిహామీ వరంలా మారింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కొత్త జాబ్‌కార్డుల మంజూరును తాత్కాలికంగా నిలిపివేయడంతో కొత్తగా పనులు చేసేందుకు ఆసక్తి చూపే కూలీలు ఉపాధి పనులకు దూరమవుతున్నారు. కొత్త జాబ్‌కార్డుల జారీతోపాటు పాత జాబ్‌కార్డులో పేర్ల తొలగింపులు, చేర్పుల ప్రక్రియపై సైతం నిబంధనలు విధించింది. చనిపోయిన కూలీల పేర్ల తొలగింపు ప్రక్రియ సైతం నిలిచిపోవడంతో పనిచేసే కూలీల సంఖ్య తగ్గుతోంది. పెళ్లికి ముందు తల్లిదండ్రులతో కలిసి జీవించి వివాహ అనంతరం వేరు కాపురం ప్రారంభించిన కుమారులకు సైతం కొత్త జాబ్‌కార్డులు రావడం లేదు. పలువురు పనులు చేసేందుకు ముందుకొస్తున్నా అధికారులు వారికి అవకాశం కల్పించలేకపోతున్నారు. చేసేదేమీ లేక కూలీలు ఇతర పనులను వెతుక్కుంటున్నారు. వేసవి ప్రారంభం కావడంతో పనుల కోసం కూలీలు వలస వెళ్లాల్సి వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement