
సాక్షి, ఆసిఫాబాద్: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ జిల్లాలో ప్రధాన పార్టీల మధ్య నువ్వా.. నేనా అన్న రీతిలో తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరన్నది బీఆర్‌ఎస్‌లో స్పష్టం కాగా.. కాంగ్రెస్ పార్టీలో ఇంకా తేలలేదు. అయినా పార్టీ టికెట్ తమకే వస్తుందనే ధీమాతో ఉన్న ఆశావహులు ప్రచారంలోనే కాకుండా.. అధికార పార్టీ బలబలాలపైనా ప్రత్యేక దృష్టి సారించా రు. మండలాలు, గ్రామాల వారీగా ఆయా పార్టీల్లో బలమైన నాయకులు ఎవరు..? వారి బలహీనతలు ఏమిటి..? వారు పార్టీ ఫిరాయి స్తే గెలుపోటములపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..? అనే అంశాలపై బేరీజు వేసుకుని, బేరసారాలకు దిగుతున్నట్లు సమాచారం. గ్రామ, మండలస్థాయి నేతలకు రూ.3 లక్షల నుంచి రూ.5లక్షల వరకు నజరానాలు ఇచ్చి పార్టీల్లోకి ఆహ్వానిస్తుండటంతో జిల్లా రాజకీయాల్లో వేడి రాజుకుంటోంది.
కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాలు ఉన్నాయి. అధికార పార్టీ సిర్పూర్, ఆసిఫాబాద్ అసెంబ్లీ అభ్యర్థులుగా కోనేరు కోనప్ప, కోవ లక్ష్మిలను ప్రకటించింది. కాంగ్రెస్‌లో సిర్పూర్ నియోజకవర్గానికి కోరళ్ల కృష్ణారెడ్డి, రావి శ్రీనివాస్‌లలో ఒక్కరికి టికెట్ దక్కే అవకాశం ఉంది. అలాగే ఆసిఫాబాద్‌లోనూ గణేష్‌రాథోడ్, శ్యాంనాయక్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. ఎవరికి వారు సొంత ప్రచార రథాల్లో నియోజకవర్గాల్లో ఊరువాడా తిరుగుతూ ప్రచారం మొదలెట్టారు. ఆసిఫాబాద్‌లో బీజేపీకి అంతగా పట్టులేకపోగా.. సిర్పూర్ నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. అదేవిధంగా బీఎస్పీ కూడా అధికార పార్టీకి సవాలు విసరనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రెండు నియోజకవర్గాల్లోనూ బరిలో దిగనున్న అభ్యర్థులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రచారాలు మొదలెట్టి.. ప్రత్యర్థి పార్టీ నేతలకు గాలం వేసే పనిలో నిమగ్నమయ్యారు.
పార్టీ కార్యకర్తలు జారిపోకుండా చర్యలు..
జిల్లాలోని రెండు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నాయకులు తమ నుంచి జారిపోకుండా ఆయా పార్టీల అగ్రనేతలు ప్రత్యేక దృష్టి సారించారు. అందుకనుగుణంగా వారిని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో తాము గెలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలు కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. ఇక పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న కార్యకర్తలు, నాయకులకు ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి పార్టీలో కొనసాగే విధంగా ఆయా పార్టీలు దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ద్వితీయ శ్రేణి నేతలకు గాలం..!
త్వరలో జరగనున్న ఎన్నికలకు జిల్లాలో అన్ని రాజకీయపార్టీలు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాల్లోని అన్ని మండలాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్ధం చేస్తున్న నేతలు.. అదేసమయంలో ప్రత్యర్థి పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న ద్వితీయశ్రేణి నేతలకు గాలం వేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసిఫాబాద్‌లో బీఆర్‌ఎస్ కోసం కష్టపడ్డా తమకు ఎలాంటి ప్రాధాన్యత దక్కలేదన్న ఆక్రోశంతో ఉన్న వారిపై కాంగ్రెస్ పార్టీ కన్నేసినట్లు సమాచారం.
ఒక్కో నేతకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఇచ్చి వారి సేవల్ని ఎన్నికల్లో వినియోగించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతకు సైతం భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అధికార పార్టీ సైతం అదే పంథాలో వెళ్తున్నట్లు సమాచారం. ఒకవేళ మాట వినని ద్వితీయశ్రేణి నాయకులపై అవసరమైతే ‘సామ..దాన..దండోపాయాలు..’ వినియోగించి తమ వైపునకు తిప్పుకోవడానికి యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సిర్పూర్ నియోజకవర్గంలోనూ ఇదేవిధంగా ఆయా పార్టీలు తమ బలం పెంచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ఆయా పార్టీల్లో చేరికలన్నీ ఇంచుమించు ఇలాంటివేనని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.