సుద్దాలలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం
● వందేళ్లుగా వెలుగుతున్న అఖండదీపం
భీమారం కోదండరామాలయంలో..
భీమారం: చెన్నూరు ప్రాంతంలోనే ప్రసిద్ధి గాంచిన భీమారం శ్రీకోదండరామాలయాన్ని శ్రీరామనవమి ఉత్సవాలకోసం ముస్తాబు చేశారు. 40 ఏళ్లక్రితం నిర్మించిన ఆలయంలో ఏటా పెద్దఎత్తున నవమి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆలయాన్ని సందర్శించిన అనంతరం కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకం భక్తుల్లో ఉంది. శ్రీసీతారామ కల్యాణం కోసం ఈసారి ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించారు. సుమారు 5వేల మంది భక్తులు హాజరవుతారని, ఈమేరకు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.
చెన్నూర్‌రూరల్: సుద్దాల గ్రామంలోగల శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైంది. ఆలయానికి ఎంతో చరిత్ర ఉందని పూర్వీకులు చెబుతున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. సుద్దాలకు వచ్చిన ఒక ముని వాగు ఒడ్డునున్న చింత చెట్టు కింద సీతారాములు, లక్ష్మణుడు, ఆంజేయస్వామి రాతి విగ్రహాలను బయటకుతీశాడు. అక్కడే వాగు ఒడ్డునే ఒక పందిరి వేసి విగ్రహాలను ప్రతిష్ఠించాడు. చెన్నూర్ పట్టణానికి చెందిన రామగుడు కిష్టయ్య అనే భక్తుడి కలలో శ్రీరాముడు కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించాలని కోరగా అతను గ్రామస్తుల సహాయంతో డంగు సున్నంతో 1910లో ఆలయాన్ని నిర్మించారు. అలాగే సీతారాములు, లక్ష్మణుడు, ఆంజనేయుల పంచలోహ విగ్రహాలను తెప్పించి ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పుడు ఆయన వెలిగించిన అఖండ దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఏటా ఇక్కడ శ్రీరామనవమి పర్వదినాన సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని కన్నుల పండువగా నిర్వహిస్తారు. ఏడు రోజలు పాటు నాగవెల్లి తదితర ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాలకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కు తీర్చుకుంటారు.
30న కల్యాణ మహోత్సవం..
ఈనెల 30 గురువారం శ్రీరామనవమిని పురస్కరించుకొని ఇక్కడ అంగరంగ వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముడుపు కడితే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల నమ్మకం. కాగా, ఈ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉందని, కోరిన కోర్కెలు తీరుతాయని ఆలయ అర్చకుడు మహేందర్‌శర్మ తెలిపారు.
ఆలయంలో వెలుగుతున్న అఖండదీపం
భీమారం: మండల కేంద్రంలో ముస్తాబైన రామాలయం


