వెదురు.. బెదురు లేకుండా! | - | Sakshi
Sakshi News home page

వెదురు.. బెదురు లేకుండా!

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

● కొన్నేళ్ల క్రితమే అటవీ వృక్షజాతి జాబితా నుంచి తొలగింపు ● సాగు, రవాణాపై ఆంక్షలు ఎత్తివేత ● రైతులను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు

రైతులు ముందుకు రావాలి

● కొన్నేళ్ల క్రితమే అటవీ వృక్షజాతి జాబితా నుంచి తొలగింపు ● సాగు, రవాణాపై ఆంక్షలు ఎత్తివేత ● రైతులను ప్రోత్సహిస్తున్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు
నేడు ‘ప్రపంచ వెదురు దినోత్సవం’

కల్లూరురూరల్‌: వెదురు సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సాహం అందిస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు వెదురు సాగు, రవాణాపై ఆంక్షలు ఉండేవి. ఒకవేళ రైతుల సొంత భూమిలో పెరిగిన వెదురు నరకాలన్నా, రవాణా చేయాలన్నా అటవీ శాఖ అనుమతులు తీసుకోవాల్సి వచ్చేది. ఈక్రమాన కొన్నేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వెదురును చెట్ల జాబితా నుంచి తొలగించి గడ్డి జాబితాలో చేర్చింది. ఫలితంగా ‘గ్రీన్‌ గోల్డ్‌’చే పిలిచే వెదురును రైతులు స్వేచ్ఛగా సాగు చేయడమే కాక నరికి ఇతర ప్రాంతాలకు సులభంగా రవాణా చేసే అవకాశం లభించింది. తక్కువ పెట్టుబడితో గరిష్ట లాభాలు అందించే గుణం ఉండడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ఈమేరకు నేడు (శుక్రవారం) ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా కథనం...

సాగుకు రాయితీలు

అనేక లాభాలు ఉన్న వెదురు సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహిస్తున్నాయి. ఒక్కో రైతు 25 ఎకరాల వరకు వెదురు సాగు చేసుకునేందుకు సబ్సిడీ, రాయితీలు ఇస్తున్నారు. ఎకరాకు 150 మొక్కలు నాటే అవకాశం ఉండగా, ఒక్కో మొక్కకు ప్రభుత్వం రూ.150 రాయితీ చెల్లిస్తుంది. నేషనల్‌ బ్యాంబు మిషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వమే కాక రాష్ట్ర ప్రభుత్వం హార్టికల్చర్‌ మిషన్‌ ద్వారా రైతులకు సహకారం అందుతోంది.

తక్కువ పెట్టుబడితో లాభాలు

ఎల్‌నినో నేపథ్యాన వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న సాగు చేసే పరిస్థితి లేకపోగా పంట చేతికి వచ్చే వర కు ఎదురుచూడక తప్పదు. కానీ తక్కువ పెట్టుబడి అవసరమయ్యే వెదురు సాగు చేస్తే త్వరగా దిగుబడి మొదలై దీర్ఘకాలం లాభాలు దక్కనున్నాయి. ఎకరానికి రూ.20వేల నుంచి రూ.25వేల లోపే ఖర్చవుతుంది. అంతేకాక వెదురు పంటకు చీడపీడలు, వైరస్‌లు ఆశించవు. క్రిమి సంహారక మందులు పిచికారీ చేయాల్సిన అవసరం పెద్దగా ఉండదు. ప్రకృతి వైపరీత్యాలు, భారీ వర్షాలు, తుపాన్లను సైతం ఈ పంట తట్టుకుని నిలబడుతుంది.

ఒక్కసారి నాటితే 40 – 45 ఏళ్లు

వెదురు నాటిన మూడు లేదా నాలుగో సంవత్సరం నుంచి కోతకు వస్తుంది. పంట చేతికి రావడం ప్రారంభమైతే ఎకరానికి రూ.1.50 లక్షలు మొదలు రూ.4లక్షల వరకు ఆదాయం పొందే అవకాశముంది. ఈ పంట నాటితే సుమారు 40 – 45 ఏళ్ల వరకు నిరంతరంగా దిగుబడి వస్తుంటుంది. ఒక గడను నరికాక దుంప నుంచి మళ్లీ కొత్త పిలకలు వాటంతట అవే వేగంగా పెరుగుతాయి. అంతేకాక వెదురు నాటాక మొదటి మూడేళ్లు అల్లం, పసుపు, మిరప, వేరుశనగ లేదా కూరగాయాలను అంతర పంటలుగా సాగు చేసుకోవచ్చు.

మార్కెట్‌లో డిమాండ్‌

వెదురు ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉంది. ప్రస్తుతం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా వెదురు వస్తువుల వినియోగం పెరుగుతోంది. వెదురుతో చేసిన బుట్టలు, కుర్చీలపై పలువురు ఆసక్తి చూపిస్తుండగా.. కాగితం పరిశ్రమ, భవన నిర్మాణ రంగం, అగర్‌బత్తీల తయారీ, బయో ఇంధనాల్‌ తయారీలో వెదురు ఉపయోగిస్తున్నారు. ఎలాంటి భూమిలోనైనా పెరిగే వెదురు సాగుకు నీటి అవసరం కూడా పెద్దగా ఉండదు.

వెదురు సాగుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందున రైతులు ముందుకు రావాలి. సబ్సిడీలు, రాయితీలు అందుతాయి. నేషనల్‌ హార్టికల్చర్‌ మిషన్‌తో పాటు రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యాన సాగుకు ప్రోత్సహిస్తున్నాం. వెదురు సాగుతో రైతులకు మంచి లాభాలు ఉంటాయి.

– నగేష్‌, ఉద్యాన శాఖ అధికారి, ఖమ్మం డివిజన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement