కొత్తగూడెం నుంచి ఏపీకి మూడు బస్సులు | - | Sakshi
Sakshi News home page

కొత్తగూడెం నుంచి ఏపీకి మూడు బస్సులు

Sep 18 2026 12:15 AM | Updated on Sep 18 2026 12:15 AM

చుంచుపల్లి: ప్రయాణికుల సౌకర్యార్థం కొత్తగూడెం ఆర్టీసీ డిపో నుంచి ఏపీలోని శ్రీకాకుళం, అమలాపురం, నర్సాపురం ప్రాంతాలకు గురువారం నుంచి సూపర్‌ లగ్జరీ సర్వీసులు ప్రారంభించినట్లు డిపో మేనేజర్‌ యు.రాజ్యలక్ష్మి తెలిపారు. శ్రీకాకుళం సర్వీసు భద్రాచలం నుంచి సాయంత్రం 5:15 గంటలకు మొదలై, కొత్తగూడెంకు 6:30 గంటలకు చేరుతుందని, అక్కడి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:30కు శ్రీకాకుళం చేరుతుందని వెల్లడించారు. అలాగే, అమలాపురం సర్వీసు కొత్తగూడెం నుంచి మధ్యాహ్నం 2:15 గంటలకు బయలుదేరి రాత్రి 9:30కు, నర్సాపురం బస్సు కొత్తగూడెం నుంచి మధ్యాహ్నం 3గంటలకు మొదలై రాత్రి 10 గంటలకు చేరుకుంటుందని పేర్కొన్నారు. కాగా, రద్దీ దృష్ట్యా గుంటూరుకు అదనంగా డీలక్స్‌ సర్వీసులు నడిపిస్తున్నందున ప్రయాణికులు సద్వియోగం చేసుకోవాలి డీఎం సూచించారు.

రేక్‌ పాయింట్‌కు 1,323 మె.టన్నుల యూరియా

చింతకాని: చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్‌ పాయింట్‌కు క్రిబ్‌కో కంపెనీకి చెందిన 1,323 మెట్రిక్‌ టన్నుల యూరియా గురువా రం చేరింది. ఇందులో నుంచి ఖమ్మం జిల్లాకు 523 మె.టన్నులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు 400 మె.టన్నులు, మహబూబాబాద్‌ జిల్లాకు 300 మె.టన్నుల యూరియా సరఫరా చేశారు. మరో 100 మెట్రిక్‌ టన్నులను బఫర్‌ స్టాక్‌గా నిల్వ చేశామని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య తెలిపారు.

‘ఉపాధ్యాయుల

సర్దుబాటులో అక్రమాలు’

ఖమ్మం సహకారనగర్‌: జిల్లాలో ఇటీవల చేపట్టిన ఉపాధ్యాయుల సర్దుబాటులో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన జరిగిందని టీపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌.విజయ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళరావు ఆరోపించారు. ఈమేరకు గురువారం డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపాక డీఈఓ సదానందంకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలల నుంచి ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సింది పోయి, ఎక్కువగా ఉన్న పాఠశాలల నుంచి కూడా ఉపాధ్యాయులను ఇతర పాఠశాలలకు పంపించారని పేర్కొన్నారు. కొన్నిచోట్ల జిల్లా యూనిట్‌గా, ఇంకొన్ని చోట్ల మండలాన్ని యూనిట్‌గా తీసుకోవడంతో పాటు సీనియారిటీ విషయంలో నిబంధనలు పాటించలేదన్నారు. మరోపక్క ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే అవసరమైన పాఠశాలల్లో నలుగురు ఉన్నా సర్దుబాటు చేయలేదని ఆరోపించారు. ఈమేరకు నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు తేలితే సరిచేస్తామని డీఈఓ హామీ ఇచ్చినట్లు తెలిపారు. నాయకులు వీరబాబు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావు, బావసన్‌, యాకోబు, పాషా, జి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సీ్త్రనిధి రుణాల వసూళ్లపై విచారణ

కల్లూరురూరల్‌: కల్లూరు మండలం ముగ్గు వెంకటాపురం గ్రామంలో సీ్త్రనిధి రుణాల అవకతవకలపై సీ్త్రనిధి మేనేజర్‌ వేణు గురువారం విచారణ ప్రారంభించారు. గ్రామంలోని 22 సంఘాలకు రూ.43 లక్షల మేర రుణాలు మంజూరు చేయగా, తీసుకున్న సభ్యులు తిరిగి చెల్లించారు. అయితే, రేణుక గ్రూపు, దుర్గమ్మ గ్రూప్‌ సభ్యులు రుణాలు చెల్లించినా రికార్డుల్లో బకాయి ఉన్నట్లు చూపిస్తుండడంతో బుధవారం కల్లూరులోని ఐకేపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఈవిషయమై ‘సాక్షి’లో కథనం రావడంతో అధికారులు స్పందించారు. ఈమేరకు ముగ్గువెంకటాపురం గ్రామాన్ని సందర్శించి మహిళలను కలిసి వివరాలు సేకరించారు. పది రోజుల్లో సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి గ్రూపుల వారీగా మంజూరైన రుణాలు, చెల్లింపుల వివరాలు తెలుసుకుంటామని వెల్లడించారు

కేఎంసీ ఉద్యోగిపై

దాడికి యత్నం

ఖమ్మంమయూరిసెంటర్‌: ఖమ్మం నగర పాలక సంస్థలో ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగిపై కొందరు దాడికి యత్నించారు. కొందరు వ్యక్తులు గురువారం ఉదయం డంపింగ్‌ యార్డ్‌లో వీడియో తీస్తుండగా.. అనుమతి లేకుండా తీయొద్దని సదరు ఉద్యోగి అడ్డుకోవడంతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఉద్యోగి కేఎంసీ కార్యాలయానికి చేరుకోగా.. అప్పటికే వచ్చి ఉన్న సదరు వ్యక్తులు ఉద్యోగి చొక్కా పట్టుకుని దాడికి దిగడంతో స్థానికులు అడ్డుకున్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఉద్యోగికి కమిషనర్‌ సూచించినట్లు తెలిసింది.

విధుల్లో చేరిన ఏఎంసీ..

అనారోగ్య సమస్యతో సుదీర్ఘ సెలవుల్లో వెళ్లిన కేఎంసీ అసిస్టెంట్‌ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ విధుల్లో చేరారు. ఈమేరకు గురువారం కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్యను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement