భద్రాచలంలో
రూ.ఐదు కోట్లకు టోకరా!
భద్రాచలంటౌన్: భద్రాచలంలో చోటు చేసుకుంటున్న వరుస మోసాలు ఆందోళన కల్గిస్తున్నాయి. ఇటీవల అధిక వడ్డీల ఆశ చూపి భరత్, ఉద్యోగాల పేరుతో ఎమ్మెల్యే పీఏ కల్యాణ్ చేసిన ఉదంతాలు మరువక ముందే గురువారం మరో భారీ మోసం వెలుగుచూసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని, భీమవరం, పాలకొల్లు ప్రాంతాల్లోని రియల్ ఎస్టేట్ వెంచర్లు, అపార్ట్‌మెంట్లలో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ సుమారు రూ.5 కోట్ల వరకు వసూలు చేసి మోసగించారని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులంతా ఆందోళనకు దిగడం, ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితుల కథనం ప్రకారం.. పిల్లల చదువుల ఫీజులు, వ్యాపార పెట్టుబడులు, ఇతర ఆకర్షణీయమైన పథకాల పేరుతో బత్తుల పద్మ పెద్ద మొత్తంలో నగదు వసూలు చేసింది. ఆమె భర్త బత్తుల శ్రీనివాస్ ప్రస్తుతం ఖమ్మంలో అసిస్టెంట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బాధితులు ఇళ్లలోని బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి, మరికొందరు వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ నమ్మకంతో పద్మకు డబ్బులు ఇచ్చినట్లు కన్నీరుమున్నీరయ్యారు.
ఇల్లు ఖాళీ చేస్తుండగా ధర్నా..
ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోగా, ఏసీటీఓ బత్తుల శ్రీనివాస్ గురువారం ఇల్లు ఖాళీ చేసి వెళ్తున్నారనే సమాచారంతో 30 మంది ఆయన నివాసానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఇంటి ఎదుట ధర్నాకు దిగారు. నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈక్రమాన తీవ్ర మనస్తాపానికి గురైన ఓ మహిళా బాధితురాలు అందరూ చూస్తుండగానే ఆమె వెంట తెచ్చుకున్న మాత్రలు మింగడంతో పాటు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న మిగతా వారు ఆమెను అడ్డుకోవడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా.. సమాచారం అందుకున్న భద్రాచలం పట్టణ పోలీసులు అక్రడకు చేరుకుని ముందుగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పట్టణంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. కాగా, ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు అందలేదని సీఐ నాగరాజు తెలిపారు.


