కన్నీటి పర్యంతమైన
అప్పలనరసింహాపురం
కన్నీటి నడుమ
తండ్రీకుమార్తె అంత్యక్రియలు
నన్ను బతికించండి మామయ్యా
నేలకొండపల్లి: నేలకొండపల్లి మండలం అప్పలనరసింహాపురానికి చెందిన రైతు పుసులూరి శ్రీనివాస్ కలుపు మందు కలిపిన కూల్ డ్రింగ్ తాగి.. ఆ తర్వాత తన కుమారుడు, కుమార్తెకు కూడా తాగించిన విషయం విదితమే. ఘటనలో శ్రీనివాస్, ఆయన కుమార్తె లాస్య మృతి చెందగా.. కుమారుడు నిఖిల్ హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు తండ్రీకుమార్తె మృతదేహాలను గురువారం అప్పలనరసింహాపురం తీసుకురాగా.. కుటుంబీకులు, స్థానికుల రోదనల నడుమ అంత్యక్రియలు పూర్తిచేశారు.
పిల్లలను పానీపూరి తినిపించి...
పుసులూరి శ్రీనివాస్–లీలా దంపతులకు కుమార్తె లాస్య, కుమారుడు నిఖిల్ ఉన్నారు. ఆయన గ్రామంలోని పది ఎకరాలతో పాటు ముదిగొండ ుండలం పెద్ద మండవ, ఏపీలోని గండ్రాయిలో పదేసి ఎకరాలు కౌలుకు తీసుకుని పంటలు సాగు చేస్తున్నాడు. ఇటీవల పెట్టుబడులకు అప్పులు చేయగా, చీడపీడలకు తోడు సరిపడా నీరు అందక మనోవేదనకు గురయ్యాడు. దాదాపు రూ.15 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. వినాయకచవితి పండగ కోసం ఇంటికి వచ్చిన లాస్యను బుధవారం బైక్‌పై తీసుకుని నిఖిల్ స్కూల్‌కు వద్దకు వెళ్లి బయటకు తీసుకొచ్చాడు. కోదాడలో ఇద్దరికీ ఇష్టమని పానీపూరి తినిపించాక కలుపు మందు కలిపిన థమ్సఫ్ సీసాతో గండ్రాయిలో కౌలు చేస్తున్న పొలం వద్దకు వెళ్లాడు. తొలుత శ్రీనివాస్ తాగి... ఆ తరువాత లాస్యకు తాగించగా.. నిఖిల్ కొద్దిగా తాగగానే ఘాటుగా ఉందని తాగలేకపోయాడు. ఆ తర్వాత విషయాన్ని శ్రీనివాస్ తన బావమరిదికి ఫోన్‌లో చెప్పి స్విచాఫ్ చేసినా పోలీసుల సాయంతో ఘటనా స్థలిని గుర్తించే సరికి శ్రీనివాస్, లాస్య స్పృ హ కోల్పోయారు. ముగ్గురికి గండ్రాయిలో చికిత్స అందించి ఖమ్మం తరలించగా తండ్రి, కూతురు మృతి చెందారు.
ఖమ్మంలో చికిత్స పొందుతుండగా లాస్య వద్దకు వెళ్లిన మేనమామను చూసి బోరున విలపించించిందని కుటుంబీకులు తెలిపారు. ‘మామయ్యా కడుపులో నొప్పి, మంటగా ఉంది.. నన్ను బ్రతికించండి...’ అంటూ రోదించిందని గుర్తు చేసుకుంటూ మృతదేహం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా, హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న నిఖిల్‌ను గురువారం శ్రీనివాస్ తండ్రి రామారావుతో వీడియో కాల్ మాట్లాడించగా.. ‘తాతా నేను బాగున్నా.. నాకేమీ కాలేదు...’ అని చెప్పాడు. ఇక గండ్రాయి శివారులో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకోగా అక్కడి పోలీసులు గురువారం అప్పలనరసింహాపురం వచ్చారు. శ్రీనివాస్ భార్య లీల, తండ్రి రామారావు నుంచి వివరాలు సేకరించారు. అయితే, ‘అప్పులు ఉన్నాయని చెప్పుకుని బాధపడేవాడు.. ఏమీ కాదని ధైర్యం చెప్పాను. అయినా ఇలా చేసుకుంటాడని ఊహించలేదు’ అని శ్రీనివాస్ తండ్రి రామారావు పోలీసులకు వివరించారు. ఇక భర్త, కుమార్తెను కోల్పోగా.. కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లీల రోదించిన తీరు అందరినీ కంట తడిపెట్టించింది.


