ఖమ్మం వైరారోడ్: ఖమ్మం శ్రీనివాసనగర్‌లో యాభై ఏళ్లుగా నివాసం ఉంటున్న వారి ఇళ్ల తొలొగింపునకు నోటీసులు ఇవ్వడంపై కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈమేరకు బాధితులకు అండగా నిలుస్తామని బీఆర్‌ఎస్ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు వెల్లడించారు. ఇందులో భాగంగా న్యాయవాదులు బిచ్చల తిరుమలరావు, మేకల సుగుణరావు, కొత్త వెంకటేశ్వరరావు, దిరిశాల కృష్ణారావు గురువారం శ్రీనివాసనగర్‌కు వెళ్లి బాధిత కుటుంబాలతో చర్చించారు. హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మాజీ మంత్రి పువ్వాడ కూడా బాధిత కుటుంబాలతో ఫోన్‌లో మాట్లాడి న్యాయ పోరాటానికి ఖర్చులన్నీ తానే భరిస్తానని తెలిపారు. నాయకులు పగడాల నాగరాజు, బచ్చు విజయ్‌కుమార్, పాలడుగు పాపారావు, బత్తుల మురళీప్రసాద్, మలుసూరు ముక్తేశ్వరరావు, పసుమర్తి రామ్మోహన్, మెంతుల శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
ఇళ్లు తొలగిస్తే ఊరుకునేది లేదు...
ఖమ్మంమయూరిసెంటర్: గత 50 ఏళ్లుగా శ్రీనివాసనగర్‌లో నివాసం ఉంటున్న వారి ఇళ్లను తొలగిస్తే ఊరుకునేది లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు హెచ్చరించారు. సీపీఎం త్రీ టౌన్ కమిటీ ఆధ్వర్యాన గురువారం అయ్యప్ప స్వామి గుడి ప్రాంత వాసులను కలిశారు. అనంతరం షేక్ సైదులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాగేశ్వరరావు మాట్లాడుతూ మూడు తరాలుగా ప్రజలు జీవిస్తుండగా, వారి ఇళ్ల తొలగించే ప్రయత్నాలను సహించబోమని తెలిపారు. పార్టీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై.విక్రమ్, నాయకులు యర్రా శ్రీనివాసరావు, భూక్యా శ్రీనివాసరావు, బండారు రమేష్, వజేనేపల్లి శ్రీనివాసరావు, ఎల్లంపల్లి వెంకట్రావు, బండారు వీరబాబు, బజ్జూరి రమణారెడ్డి, షేక్ హిమామ్, యర్రా రంజిత్, శీలం వీరబాబు, రంగు హన్మంతాచారి, షేక్ మస్తాన్, బండారు సునీత తదితరులు పాల్గొన్నారు.


