‘సీతారామ’తో గోదావరి జలాల కళ | - | Sakshi
Sakshi News home page

‘సీతారామ’తో గోదావరి జలాల కళ

May 26 2026 3:14 AM | Updated on May 26 2026 3:14 AM

రైతులను ఒప్పిస్తే

డిస్ట్రిబ్యూటరీల పనుల్లో వేగం

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

సత్తుపల్లిటౌన్‌: ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల్లో సాగు అవసరాలకు గోదావరి జలాలను అందించేలా సీతారామ ప్రాజెక్టు పనులను వేగంగా చేపడుతున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రోత్సాహంతో పనులపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. సత్తుపల్లి మండలం యాతాలకుంట టన్నెల్‌ను సోమవారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు దివాకర టీఎస్‌, అంకిత్‌, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణతో కలిసి ఆయన సోమవారం పరిశీలించారు. స్వయంగా ట్రాక్టర్‌ నడుపుతూ టన్నెల్‌లో 1.8 కిలోమీటర్ల మేర పరిశీలించిన మంత్రి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని ఖమ్మం మినహా తొమ్మిది నియోజకవర్గాలకు ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు అందుతాయని తెలిపారు. రానున్న వర్షాకాలం సీజన్‌లోనే సత్తుపల్లి ట్రంక్‌ ద్వారా బేతుపల్లి, వేశ్యకాంతల చెరువులకు గోదావరి జలాలు చేర్చాలనే లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు. ఫలితంగా సత్తుపల్లి ప్రాంతంలో లక్ష ఎకరాలను గోదావరి జలాలతో సాగు చేసుకోవచ్చన్నారు. సాగర్‌ నీళ్లు రాకపోయినా.. రాజీవ్‌ లింక్‌ కెనాల్‌ ద్వారా వైరా రిజర్వాయర్‌ను గోదావరి నీళ్లతో నింపి లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు.

పంపులు, మోటార్లకే పరిమితం..

గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టు కేవలం పంపులు, పైపులకే పరిమితమైందని మంత్రి తుమ్మల తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో తాను మాట్లాడి సీతారామ ప్రాజెక్టుతో జిల్లా సస్యశ్యామలం అయ్యేలా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు వెచ్చిస్తే డిస్ట్రిబ్యూటరీలన్నీ పూర్తవుతాయన్నారు. యాతాలకుంట టన్నెల్‌లో సుమారు 2.5 కి.మీ.ను ఏడాదిలోనే పూర్తి చేసిన అధికార యంత్రాంగం, ఏజెన్సీని అభినందించారు. ప్రధాన కాల్వకు 11 వేల ఎకరాలు, డిస్ట్రిబ్యూటరీకి మరో 11 వేల ఎకరాల భూమి అవసరం ఉన్నందున ప్రజాప్రతినిధులంతా కలిసి రైతులను ఒప్పిస్తే ఈ ఏడాది ఆగస్టు 15 కల్లా గోదావరి జలాలు వస్తాయని తెలిపారు. సమావేశంలో సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు సీఈ శ్రీనివాసరెడ్డి, ఏసీపీ వసుంధరయాదవ్‌, ఎఫ్‌డీఓ వాడపల్లి మంజుల, విద్యుత్‌శాఖ డీఈఈ ఎల్‌.రాములు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement