● ఇంటర్‌నెట్, స్మార్ట్‌ఫోన్లకు దూరంగా గొత్తికోయ చిన్నారులు ● అడవే ఆటస్థలం.. ప్రకృతే ఆటబొమ్మ
బొమ్మలాటలో నిమగ్నమైన పిల్లలు
రైలు బండి ఆడుతూ...
చెట్ల కొమ్మే జారుడుబండగా..
కరకగూడెం: వేసవి సెలవులు వచ్చాయంటే పట్టణాలు, మైదాన ప్రాంతాల పిల్లలు ఇళ్లకే పరిమితమై స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, వీడియో గేమ్స్‌తో పాటు ఇండోర్ గేమ్స్‌తో కాలక్షేపం చేస్తుంటారు. ఉదయమో, సాయంత్రమో కాసేపు అలా బయటకు వచ్చి ఆడుకుంటారు. కానీ, అడవిని నమ్ముకుని బతికే గొత్తికోయ గూడేల్లో పిల్లల ముచ్చట్లే వేరు. వీరంతా అడవి ఒడిలోనే స్వేచ్ఛగా విహరిస్తూ ప్రకృతిని ఆస్వాదిస్తున్నారు.
ఈత కాయల వేట..
గొత్తికోయ గ్రామాల్లోని చిన్నారులకు ఈత చెట్లే వేసవి పిక్నిక్ స్పాట్లు. కుటుంబ సభ్యులతో కలిసి ఉదయాన్నే గుంపులుగా ఈత చెట్ల వద్దకు వెళ్లి కాయలను ఏరుకుంటూ, తింటూ గడుపుతారు. ప్రకృతి ప్రసాదించిన తీయని పండ్లను సేకరించడమే వారికి పెద్ద ఆట.
మట్టిబొమ్మలు, చికుబుకు రైళ్లు
వీరి ఆటల్లో ప్లాస్టిక్ బొమ్మలు, ఖరీదైన గ్యాడ్జెట్లు ఉండవు. అడవిలో దొరికే మట్టి, రాళ్లు, ఆకులతోనే బొమ్మలాట ఆడుకుంటారు. ఒకరినొకరు పట్టుకుని చికుబుకు.. అంటూ రైలు బండి ఆడుతూ ప్రకృతి ఒడిలో పరుగులు తీస్తున్నారు. ఇవికాక వాటర్ రోలర్‌ను తోసుకుంటూ గడపడం, పెద్ద చెట్ల కొమ్మలను జారుడు బండల్లా మార్చుకుని జారుతూ సందడి చేస్తుండడం కనిపిస్తోంది.
ఈత చెట్టు కింద కాయలు ఏరుతున్న చిన్నారులు


