అనుమతి లేకుండానే లకారం సర్కిల్‌లో పైలాన్ నిర్మాణం మాజీ ప్రధాని పీవీ విగ్రహ ప్రాంగణంలో నిర్మాణంపై నిరసన ఉన్నతాధికారుల సూచనలతో తొలగింపు
కార్యకర్తల అత్యుత్సాహంతోనే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లా కేంద్రంలోని కూడళ్లలో అనుమతి లేకుండా చేపడుతున్న నిర్మాణాలతో పాలకులు అభాసుపాలవుతున్నారన్న చర్చ జరుగుతోంది. లకారం ట్యాంక్‌బండ్ వద్ద మాజీ ప్రధాని పీ.వీ.నరసింహా రావు విగ్రహం ఉన్న ఆవరణలోనే మంత్రి తుమ్మల 40 ఏళ్ల ప్రస్థానానికి సంబంధించి పైలాన్ నిర్మాణం చేపట్టారు. ఇది మాజీ ప్రధానిని అగౌరవపర్చడమేనని బ్రాహ్మణ సంఘం నాయకులు శుక్రవారం నిరసన తెలపగా... ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో రాత్రికి రాత్రి నిర్మాణాన్ని తొలగించారు.
2020లో ఏర్పాటు
మాజీ ప్రధాని, భారతరత్న పీ.వీ.నరసింహారావును గౌరవిస్తూ 2020లో ఆయన 100వ జయంతి ఉత్సవాలను గత ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. ఆ సమయాన ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్ వద్ద పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అంతేకాక చుట్టూ రెయిలింగ్ పెట్టి మొక్కలు నాటి ఫౌంటెన్లు ఏర్పాటు చేశారు.
40 ఏళ్ల ప్రస్థానానికి గుర్తుగా..
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా తొలిసారి ప్రమాణం స్వీకారం చేసి 40 ఏళ్లు పూర్తవడంతో కొందరు నేతలు పైలాన్ నిర్మాణానికి సిద్ధమయ్యారు. దీనికి అనుమతి లేకపోగా, పీవీ విగ్రహం వెంటే నిర్మిస్తుండడంతో ఆయన అభిమానులు, బ్రాహ్మణ సంఘం బాధ్యులు శుక్రవారం నిరసనకు దిగి కార్పొరేషన్ అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, విదేశాల్లో బ్రాహ్మణసంఘం నేతలు సైతం అభ్యంతరం చెబుతూ జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
రాత్రికి రాత్రే తొలగింపు
మాజీ ప్రధానిని గౌరవించాల్సిన వ్యక్తులు, ఆయన ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీ నేతలే విగ్రహం వెంటే పైలాన్ నిర్మిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఉన్నతాధికారులకు బ్రాహ్మణ సంఘం నేతలు, అభిమానుల నుంచి ఫిర్యాదులు అందడంతో తొలగింపుపై కేఎంసీ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. దీంతో శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత సిబ్బందితో సగం మేర పూర్తయిన పైలాన్‌ను తీయించారు.
బ్రాహ్మణసంఘం పాలాభిషేకం
లకారం సర్కిల్‌లోని పీవీ విగ్రహానికి శనివారం సాయంత్రం ఖమ్మం నగర బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యాన పాలాభిషేకం చేశారు. విగ్రహం వద్ద చేపట్టిన పైలాన్ నిర్మాణాన్ని తొలగించడంపై హర్షం వ్యక్తం చేశారు. అధ్యక్షుడు మారంరాజు రాధాకృష్ణ, మాటూరి లక్ష్మీనారాయణ, ఊటుకూరు వెంకట రవికాంత్, పర్చా రంగారావు, జమలాపురం కేశవరావు, చాగంటి రామకృష్ణ, ఊటుకూరు చంద్రశేఖరరావు, సూరావర్జుల వాసు, శ్రీకాంత్, సరస్వతి కుమార్, దేవులపల్లి నరసింహారావు, వల్లూరు విజయ్‌కుమార్, సత్యనారాయణచార్యులు, శ్రీధర్ పాల్గొన్నారు.
కొందరు కార్యకర్తల అత్యుత్సాహంతోనే ఇలా జరిగింది. మాజీ ప్రధాని పీ.వీ.నరసింహారావు
వంటి మహోన్నత వ్యక్తిని కించపరిచేలా ఎలాంటి చర్యలు ఉండకూడదు. కార్యకర్తలు ప్రచార
ఆర్భాటం కన్నా ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించాలి. పైలాన్ నిర్మిస్తున్నారనే విషయం తెలియగానే
తొలగించాలని కేఎంసీ కమిషనర్‌ను ఆదేశించా.
–తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి


