ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం విజయ డెయిరీకి తిరిగి పూర్వవైభవం తీసుకొచ్చి, రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. హైదరాబాద్‌లో శనివారం ఆయన విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ కె.చంద్రశేఖర్‌రెడ్డితో పాటు అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పాల ఉత్పత్తి, సేకరణ, రైతులకు మద్దతు ధర, మహిళల భాగస్వామ్యంపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఉమ్మడి జిల్లాలో పాడి పరిశ్రమకు అపారమైన అవకాశాలు ఉన్నందున రైతుల్లో విశ్వాసం పెంపొందిస్తే పాల సేకరణ పెరుగుతుందని తెలిపారు. అలాగే, మహిళల భాగస్వామ్యాన్ని పెంచితే లక్ష్యాలను సాధించవచ్చన్నారు. అనంతరం చైర్మన్ అమిత్‌రెడ్డి మాట్లాడుతూ డెయిరీ అభివృద్ధికి ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నాణ్యమైన పాల సేకరణకు విస్తృత అవకాశాలు ఉన్నందున, డెయిరీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ఈ సమీక్షలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, సహకార శాఖ రిజిస్ట్రార్ రాహుల్‌రాజ్, విజయ డెయిరీ జనరల్ మేనేజర్ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
సమీక్షలో రాష్ట్ర మంత్రి తుమ్మల


