ఉపాధి తగ్గుతోంది.. | - | Sakshi
Sakshi News home page

ఉపాధి తగ్గుతోంది..

May 16 2026 12:15 AM | Updated on May 16 2026 12:15 AM

సమూల మార్పులు

ఈ ఏడాదికి ఇంకా ఖరారు కాని పూర్తిస్థాయి బడ్జెట్‌ జూలై ఒకటి నుంచి అమల్లోకి వీబీజీ–రామ్‌జీ ప్రస్తుత లక్ష్యాలను పూర్తి చేస్తేనే కూలీలకు మేలు

నిబంధనలు కఠినతరం చేస్తున్నారు..

పథకాన్ని నీరు గారుస్తున్నారు..

గత రెండు, మూడేళ్లుగా జిల్లాలోని కూలీలను మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆదుకోలేకపోతోంది. జిల్లాకు కేటాయిస్తున్న పనిదినాల సంఖ్యలో హెచ్చుతగ్గులతో ఈ పరిస్థితి వస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు లేని సమయాన ఈ పథకం ద్వారా వేలాది కుటుంబాలు లబ్ధిపొందాయి. జిల్లాలోని 20 మండలాల్లో పెద్ద సంఖ్యలో కూలీలు హాజరవుతుండటంతో అధికారులు అదే స్థాయిలో పనిదినాల లక్ష్యాలను కేటాయిస్తూ వచ్చారు. కానీ ఆ పరిస్థితి క్రమేణా మారిపోతోంది. ఇక జూలై 1నుంచి వీబీజీ–రామ్‌జీ పథకం అమల్లోకి జిల్లాపై మరింత ప్రభావం పడుతుందని చెబుతున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం

పనిదినాల్లో హెచ్చుతగ్గులు

గత ఐదేళ్ల లక్ష్యాలను పరిశీలిస్తే పనిదినాల సంఖ్యలో వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. కరోనా కన్నా ముందు జిల్లాలో 70 లక్షల నుంచి 80 లక్షల పనిదినాలను కేటాయించినా కూలీల డిమాండ్‌ నేపథ్యాన పూర్తయ్యాయి. కానీ 2021 –22లో జిల్లాకు 64 లక్షల పనిదినాలు కేటాయిస్తే 65.63 లక్షల పనిదినాలు పూర్తి చేశారు. ఆ మరుసటి ఏడాది 54 లక్షలకు కుదించగా.. 57.80 లక్షల పనిదినాలు, 2023–24లో కేవలం 46 లక్షల పనిదినాలను లక్ష్యంగా కేటాయించగా.. అధిక డిమాండ్‌తో 54.79 లక్షల పనిదినాలను కల్పించారు. ఇక 2024–25 ఏడాదిలో పనిదినాల సంఖ్య 62.17 లక్షలకు పెంచారు. కానీ 60.24 లక్షల మంది కూలీలకు పనులు చూపించారు. గత ఏడాది (2025–26) మాత్రం 34.9 లక్షల పనిదినాలనే ఖరారు చేయడంతో 35.57 లక్షల మంది కూలీలు పనులకు వెళ్లారు.

నెలన్నరే గడువు

జిల్లాలో 3,05,336 జాబ్‌ కార్డులు ఉండగా, 6,28,717 మంది కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 71,573 కుటుంబాలకు చెందిన 1,08,078 మంది కూలీలు పని కావాలని కోరుతున్నట్లు వెబ్‌సైట్‌ ద్వారా తెలుస్తోంది. యంత్రాంగం మాత్రం 31,112 కుటుంబాలకే పని కల్పిస్తోంది. రోజువారీగా 60వేల మందికే పని దొరుకుతుండడం గమనార్హం. మరోపక్క ఈనెలాఖరు నాటికి జిల్లాకు 16.89 లక్షల పనిదినాల లక్ష్యాన్ని ప్రభుత్వం కేటాయిస్తే కేవలం 5.85 లక్షలే పూర్తయ్యాయి. పాత పథకం మరో నెలన్నర మాత్రమే కొనసాగనుండగా.. కొత్త పథకం వస్తే లక్ష్యాలు మారనున్నాయి. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా కూలీలకు పని కల్పిస్తే వారికి మేలు జరగడంతో పాటు జిల్లాకు నిధులు మంజూరవుతాయి.

కార్యదర్శులకే బాధ్యత

గ్రామాల్లో ఉపాధి పనులకు సంబంధించి పూర్తి బాధ్యతలను జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీ కార్యదర్శులకు అప్పగించింది. పనుల డిమాండ్‌ స్వీకరణ, కల్పన, సౌకర్యాల ఏర్పాటు, మేట్‌ల ద్వారా హాజరు నమోదు బాధ్యతలన్నీ వీరే నిర్వర్తించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటికే అనేక పనులతో సతమతమవుతున్న కార్యదర్శులకు ఈ బాధ్యతలు తలకు మించిన భారంలా మారాయి. గతంలో ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఈ పనులు చేయగా, చాలా గ్రామాల్లో వారు లేకపోవడంతో కార్యదర్శులకు అప్పగించినట్లు తెలుస్తోంది.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సమూల మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటి నుంచి వీబీజీ–రామ్‌జీ (వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ అజీవికా మిషన్‌ గ్రామీణ్‌) పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. దీనిపై పూర్తిస్థాయిలో ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు. వంద రోజుల పనిదినాలను 125 రోజులకు మారుస్తున్నట్లు కేంద్రం చెబుతున్నా.. కొన్ని కార్మికసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాకు కేటాయిస్తున్న పనిదినాలే కొత్త పథకంలోనూ రావాలంటే కూలీలతో పనులు ఎక్కువగా చేయించాలి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మే, జూన్‌ నెలల్లో యంత్రాంగం భారీ స్థాయిలో పనులను కల్పించాల్సిన అవసరముంది.

ఏటేటా పడిపోతున్న పనిదినాల సంఖ్య

కూలీలకు పని విషయంలో కేంద్రం నిబంధనలు కఠినం చేస్తోంది. ఇన్నాళ్లు 90 శాతం నిధులను కేంద్రమే భరించగా ఇప్పుడు 60శాతానికి పరిమితం చేస్తుంది. రాష్ట్రప్రభుత్వం 40శాతం కేటాయించాల్సి రావడంతో అనుకున్న స్థాయిలో పనుల కల్పన కష్టమే.

– బాగం హేమంతరావు, రాష్ట్ర అధ్యక్షుడు,

తెలంగాణ రాష్ట్ర రైతుసంఘం

కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేలా కొన్నేళ్లుగా నిధులు సరిగా కేటాయించడం లేదు. కొన్నిసార్లు నిధులు కేటాయించినా విడుదల చేయడం లేదు. కొత్త పథకంతో కూలీలు హక్కులు కోల్పోతారు. రాష్ట్ర ప్రభుత్వ వాటా పెంచడంతో పనులు తగ్గుతాయి.

– పోతినేని సుదర్శన్‌రావు, రాష్ట్ర అధ్యక్షుడు,

రాష్ట్ర రైతు సంఘం

Advertisement
 
Advertisement
Advertisement