‘సుడా’లో సవాళ్ల స్వాగతం! | - | Sakshi
Sakshi News home page

‘సుడా’లో సవాళ్ల స్వాగతం!

May 16 2026 12:15 AM | Updated on May 16 2026 12:15 AM

● అనుమతుల్లో జాప్యం.. అసంపూర్తిగా మాస్టర్‌ ప్లాన్‌ ● మరోపక్క ఉద్యోగులు, సిబ్బంది కొరత ● జిల్లా వ్యాప్తంగా విస్తరించినా అన్నీ సమస్యలే

డీసీసీబీ భవనంలోనే

కార్యాలయం

● అనుమతుల్లో జాప్యం.. అసంపూర్తిగా మాస్టర్‌ ప్లాన్‌ ● మరోపక్క ఉద్యోగులు, సిబ్బంది కొరత ● జిల్లా వ్యాప్తంగా విస్తరించినా అన్నీ సమస్యలే

ఖమ్మంమయూరిసెంటర్‌: స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(సుడా) నూతన సారథికి సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. గత 29 నెలలకు పైగా కమిటీ లేకపోవడంతో అధికార యంత్రాంగమే బండిని నెట్టుకొచ్చింది. ఇటీవల చైర్మన్‌గా పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ను నియమించగా త్వరలోనే పూర్తిస్థాయి పాలకవర్గం కొలువుదీరనుంది. ఖమ్మం నగరంతో పాటు సుడా పరిధిలోని ప్రాంతాల అభివృద్ధిపై పాలకవర్గం దృష్టి సారిస్తే తప్ప గాడిన పడే అవకాశం లేదు. ఈనెల 13న ఎలాంటి హడావుడి లేకుండా సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ బాధ్యతలు చేపట్టారు. ఇకపై పరిపాలనపైనా దృష్టి సారిస్తే సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయి.

మాస్టర్‌ ప్లాన్‌.. ఏళ్ల నాటి నిరీక్షణ

‘సుడా’ పరిధిలోని ప్రజలు, రియల్టర్లు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రధాన అంశం మాస్టర్‌ ప్లాన్‌. ఖమ్మం నగరం శరవేగంగా విస్తరిస్తున్నా పాత మాస్టర్‌ ప్లాన్‌ ఇంకా పైనల్‌ పబ్లికేషన్‌ దశకు చేరలేదు. నగరంలోని రెండు ప్రాంతాలకు సంబంధించి ప్లాన్‌లో మార్పులు చేయాలని పలువురు కోర్టుకు వెళ్లడంతో ఆటంకం ఎదురైనట్లు తెలుస్తోంది. తద్వారా చుట్టుపక్కల ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది. మాస్టర్‌ ప్లాన్‌ను త్వరగా ఆమోదించి గెజిట్‌ విడుదల చేయించడం కొత్త చైర్మన్‌ ముందున్న అతిపెద్ద సవాల్‌గా చెబుతున్నారు.

అనుమతుల్లో పారదర్శకత

సుడా పరిధి విస్తరించిన తర్వాత వెంచర్లు, భారీ భవన నిర్మాణాలకు అనుమతుల జారీలో అనేక ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో పాలకవర్గం లేని సమయంలో జారీ అయిన కొన్ని అనుమతులపై విమర్శలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు వెలిశాయనే ఫిర్యాదులు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా బాధ్యతలు చేపట్టే వారు వీటన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, పారదర్శకమైన పాలనను అందించాల్సి ఉంది.

కేఎంసీ ఉద్యోగులే ...

గత ప్రభుత్వ హయాంలో సుడా పాలకవర్గం ఉన్నప్పుడు డీసీసీబీ బ్యాంక్‌ భవనంలోని ఓ భాగాన్ని కార్యాలయంగా మార్చుకున్నారు. పాలకవర్గం రద్దయ్యాక అక్కడి నుంచి ఖాళీ చేసి ఫర్నీచర్‌ను కేఎంసీకి చేర్చారు. తిరిగి ఇటీవల చైర్మన్‌ బాధ్యతలు స్వీకరించాక అదే భవనంలో కార్యలాపాలు నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈమేరకు చైర్మన్‌ సూచనలతో అవసరమైన మరమ్మతులు మొదలుపెట్టారు. అయితే భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘సుడా’కు కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మరోవైపు ప్రత్యేకంగా ఉద్యోగులు కూడా లేకపోవడంతో కేఎంసీ అధికారులే అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీనివల్ల ఫైళ్ల కదలికలో తీవ్ర జాప్యం జరుగుతోంది. కొత్త పాలకవర్గం చొరవ తీసుకుని ప్రత్యేక ఉద్యోగులు, సాంకేతిక సిబ్బందిని నియమించుకుంటేనే దరఖాస్తుల పరిశీలన, అనుమతుల్లో జాప్యాన్ని అరికట్టవచ్చు.

దృష్టి సారిస్తేనే..

సుడా చైర్మన్‌ తొలుత పెండింగ్‌ ఫైళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఉద్యోగవర్గాలు పేర్కొంటున్నాయి. సుడా పరిధిని జిల్లా అంతటికీ విస్తరించిన నేపథ్యాన నిబంధనల అమలు, అతిక్రమణలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాక ఆదాయ వనరులను పెంచుకోవాలి. ఇటీవల సుడా నిధులను అభివృద్ధి పనులకు కాకుండా, ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల సౌకర్యాల కోసం వెచ్చించారనే విమర్శలు వస్తున్నందున మార్పులపై దృష్టి సారించాలి.

2017లో ఏర్పాటు, 2024లో విస్తరణ

స్తంభాద్రి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఏర్పాటయ్యాక ఖమ్మం నగరంతో పాటు చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. 2017 అక్టోబర్‌ 24న గత ప్రభుత్వం ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌తో పాటు వైరా మున్సిపాలిటీ, కూసుమంచి, ఖమ్మంరూరల్‌, ముదిగొండ, చింతకాని, కొణిజర్ల, రఘునాథపాలెం మండలాల్లోని 44 గ్రామపంచాయతీలను కలిపి 573 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో సుడాను ఏర్పాటు చేసింది. ఆ తర్వాత 2024 అక్టోబర్‌ నెలలో పరిధిని విస్తరించారు. దీంతో కామేపల్లి, ఏన్కూర్‌, కారేపల్లి మండలాలు మినహా జిల్లాలోని అన్ని మండలాల గ్రామపంచాయతీలను చేర్చారు. 17 మండలాల పరిధిలోని 279 గ్రామపంచాయతీలు, మధిర, సత్తుపల్లి మున్సిపాలిటీలను సుడాలో విలీనం చేయగా.. పరిధి పెరిగిన నేపథ్యాన అభివృద్ధి, పరిపాలనను పర్యవేక్షించడం కొత్త పాలకవర్గానికి సవాల్‌గా మారనుంది.

ఖమ్మంవ్యవసాయం: ఖమ్మం గట్టయ్యసెంటర్‌లోని డీసీసీబీ బ్రాంచ్‌ భవనం మొదటి అంతస్తులో ‘సుడా’ కార్యాలయాన్ని తాత్కాలికంగా కొనసాగించేందుకు సీఈఓ ఎన్‌.వెంకటఆదిత్య అనుమతించారు. సుడా చైర్మన్‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌ అభ్యర్థనతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘సుడా’ సొంత భవనం ఏర్పాటుచేసుకునేంత వరకు గతంలో మాదిరి బ్రాంచ్‌ భవనంలోని మొదటి అంతస్తులో కొనసాగింపుకు అవకాశం కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement