అన్ని రంగాల్లో విఫలమైన
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
జిల్లాలో పకడ్బందీగా
పార్టీ సభ్యత్వ నమోదుకు ప్రణాళిక
బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
తక్కెళ్లపల్లి, మాజీ మంత్రి పువ్వాడ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా రెండు జాతీయ పార్టీలు కుట్రలు చేస్తున్నాయని బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి జిల్లా పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జి తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఖమ్మంలోని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కందాల ఉపేందర్‌రెడ్డితో కలిసి వారు మాట్లాడారు. ఈ సందర్భంగా తక్కెళ్లపల్లి మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో గెలుపుతో కాంగ్రెస్ నేతలు సంబురపడుతున్నా, అన్నిరంగాల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని పేర్కొన్నారు. కేసీఆర్‌ను ఓడించి తప్పు చేశామని, బీఆర్‌ఎస్ ప్రతిపక్ష పాత్ర సమర్థవంతంగా పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ విచ్ఛిన్నం, కేసీఆర్ కుటుంబ విభజన కోసం కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక ఆధిపత్యం కోసం కుట్రలు, కుతంత్రాలతో జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు పోరాడుతున్నారన్నారు. కాగా, ఉమ్మడి జిల్లాలో పార్టీ ఓటమికి కారణాలను విశ్లేషించడమే కాక, వచ్చే ఎన్నికల్లో పది స్థానాలు కై వసం చేసుకునేలా కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. ఈమేరకు బూత్‌స్థాయిలో పార్టీ నిర్మాణంపై దృష్టి సారించగా, డిజిటలైజేషన్ పద్ధతిలో సభ్యత్వ నమోదుకు నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలను నియమించి శిక్షణ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే, ఐదుగురు సభ్యులతో మండల సమన్వయ కమిటీలు ఉంటాయని తెలిపారు. మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ పార్టీ నిర్మాణం కోసం నేతలందరం సమన్వయంతో పనిచేస్తామని చెప్పారు. పార్టీపై మమకారంతో ఉండే కార్యకర్తలను సభ్యులుగా చేర్చుకోవాలని సూచించారు. కోర్ కేడర్‌ను తిరిగి పార్టీలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నందున కేసులు పెడుతుండగా, రాబోయే రోజుల్లో మరింత ఒత్తిడి ఎదురైనా తట్టుకుని నిలబడతామని తెలిపారు. ఎవరైనా అలిగినా, తమపై కోపం ఉన్నా అన్నీ మర్చిపోదామని, పార్టీ నిర్మాణమే లక్ష్యంగా పాటుపడతానని వెల్లడించారు. ఇంకా ఈ సమావేశంలో జెడ్పీ, డీసీసీబీ మాజీ చైర్మన్లు లింగాల కమల్‌రాజ్, కూరాకుల నాగభూషణం, నాయకులు గుండాల కృష్ణ, పగడాల నాగరాజు, బీరెడ్డి నాగచంద్రారెడ్డి, బత్తుల మురళి, కర్నాటి కృష్ణ, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


