● వరి క్వింటాకు రూ.72, పత్తికి రూ.557 పెరిగిన ధర ● జిల్లాలో అత్యధికంగా సాగయ్యే రెండు పంటలివే.. ● మొక్కజొన్న ధరపై రైతుల్లో పెదవి విరుపు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో ప్రధానంగా సాగయ్యే పంటలకు మద్దతు ధర పెరిగింది. ఏటా మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకొని పంటలకు మద్దతు ధరలను నిర్ణయిస్తుంది. 2026–27 సంవత్సరానికి కూడా వివిధ పంటలకు కనీస మద్దతు ధరలను ప్రకటించింది. ఇందులో భాగంగా ధాన్యం, పప్పు దినుసులు, నూనె గింజలు, వాణిజ్య పంటల ధరలు పెంచింది. జిల్లాలో అన్నీ కలిపి ఆరు లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతుండగా.. ఇందులో వరి, పత్తి పంటలు ప్రధానంగా ఉంటాయి. వర్షాలు అనుకూలించి, జలాశయాల్లో సమృద్ధిగా నీరు ఉంటే వానాకాలంలో వరి 3.20 లక్షల ఎకరాల్లో, పత్తి 2.69 లక్షల ఎకరాల్లో సాగవుతుంది. ఇక పెసర 18 వేల ఎకరాల్లో, కంది, మినుము, వేరుశనగ వంటి పంటలు కూడా సాగవుతాయి.
వరి ధర రూ.2,461
వరి రకాల వారీగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం క్వింటాకు రూ.72 పెంచింది. గ్రేడ్–ఏ రకానికి గత ఏడాది రూ.2,389 ఉంటే ఈ ఏడాది రూ.2,461 చేరింది. ఇక సాధారణ రకాలకు గత ఏడాది రూ.2,369గా ఉన్న ధర రూ.2,441కు పెరుగుతుంది. పత్తి క్వింటాకు రూ.557 పెంచడంతో రూ.8,110 నుంచి రూ.8,667కు చేరనుంది.
మొక్కజొన్నకు కేవలం రూ.10
అపరాల పంటలకు ఈ ఏడాది కేంద్రం అరకొరగానే మద్దతు ధర పెంచింది. పెసలకు కేవలం రూ.12 మాత్రమే పెంచడంతో రూ.8,768 నుంచి రూ.8,780కు చేరుతుంది. కందులకు మాత్రం రూ.450 పెంచడంతో గతేడాది రూ.8వేలు ఉన్న మద్దతు ధర ఈ ఏడాది రూ.8,450కు పెరుగుతుంది. మినుములకు సైతం రూ.400 పెంచగా రూ.7,800 నుంచి 8,200కు చేరనుంది. జిల్లాలో అక్కడక్కడ సాగుచేసే వేరుశనగ పంటకు రూ.254 ను పెంచింది. కాగా, జిల్లాలో యాసంగి పంటగా మొక్కజొన్నను విస్తారంగా సాగు చేస్తారు. కానీ ఈ పంటకు కేవలం రూ.10 మాత్రమే పెంచారు. దీంతో గత ఏడాది క్వింటాకు రూ.2,400 ఉన్న మద్దతు ధర ఈ ఏడాది రూ.2,410కు చేరుతుంది.
పెరుగుతున్న పెట్టుబడులు
పంటల సాగుకు ఏటేటా పెట్టుబడులు పెరుగుతున్నాయి. యంత్రాలు, డీజిల్, ఎరువులు, క్రిమిసంహారక మందుల ధరలు ౖపైపెకి వెళ్తున్నాయి. వీటికి తోడు నిత్యావసర ధరలు పెరగడంతో కూలీల ధరలు పెరుగుతున్నాయి. ఇదే సమయాన కేంద్రప్రభుత్వం పెరిగిన పెట్టుబడులను పరిగణనలోకి తీసుకోకుండా పంటల ధరలు నిర్ణయించడంపై రైతుల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రధానంగా సాగయ్యే వరి, పత్తి పంటలకు పెట్టుబడులు పెరిగాయని, అందుకు అనుగుణంగా మద్దతు ధరలు పెరగడం లేదని చెబుతున్నారు. మొక్కజొన్న పరిస్థితి కూడా అలాగే ఉన్నందున మద్దతు ధరలు మరికొంత పెంచాలని కోరుతున్నారు.


