ఖమ్మంఅర్బన్: ఖమ్మం నగర పరిసరాల్లో గురువారం రెండు చోట్ల మొక్కజొన్న పొలాల్లో మంటలు చెలరేగాయి. గొల్లగూడెం–రాజన్నపేట వెళ్లే దారిలోని మొక్కజొన్న పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించినట్లు తెలిసింది. వడగాలులకు మంటలు వేగంగా వ్యాపించి పొలాల్లోని డ్రిప్ ఇరిగేషన్ పైపులు కాలిపోయాయి. అదే సమయాన వీ.వీ.పాలెం సొసైటీ పరిధి అల్లీపురం–పుట్టకోట రోడ్డులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సమీపాన కూడా మంటలు చెలరేగాయి. కేంద్రంలో వేల బస్తాల మొక్కజొన్న నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందారు. ఈమేరకు సొసైటీ చైర్మన్ రావూరి సైదుబాబు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక శాఖ సిబ్బంది చేరుకుని మంటలను ఆర్పడంతో ప్రమాదం తప్పింది.


