● మొక్కజొన్న, జొన్నలో ‘నైట్రేట్’ ● జిల్లాలోని పశువులు, ఇతర జీవాల్లో ప్రభావం గుర్తింపు ● రైతులు అప్రమత్తంగా లేకపోతే నష్టం
ఖమ్మంవ్యవసాయం: పశువులకు మేతగా వేసే గ్రాసాలు ప్రాణసంకటంగా మారుతున్నాయని పశుసంవర్థక, పశువైద్య శాఖ గుర్తించింది. మొక్కజొన్న, జొన్న, సూడాన్ గడ్డి, పొద్దు తిరుగుడు తదితర పశుగ్రాసాల్లో నైట్రేట్ ప్రభావం ఎక్కువగా ఉంటోందని తేల్చారు. ఇందులో విషప్రభావం కారణంగా పశువులు, గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు నీరసించడంతో పాటు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడడంతోపాటు ఫిట్స్ వంటి లక్షణాలతో మృత్యువాత పడుతున్నాయి. జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా ఈ యాసంగిలో 2.26 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు. పంట కోత పూర్తవడంతో ఆ భూముల్లోని పచ్చిక, ఎండిన గ్రాసంలో జీవాలను మేపుతున్నారు. మొక్కజొన్న గ్రాసం విషపూరితమైనదనే అవగాహన లేక ఇలా చేస్తుండగా పశువులు అనారోగ్యం బారిన పడడమే కాక అక్కడక్కడా మృతి చెందుతున్నాయి. ఈమేరకు జిల్లా పశు వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల డాక్టర్ మహ్మద్ రుబీనా నైట్రేట్ పశుగ్రాసం తిన్న పశువుల లక్షణాలు, చికిత్స, నివారణ వంటి విషయాలను వివరించారు.
ఇవీ లక్షణాలు..
నైట్రేట్ కలిగిన పశుగ్రాసం తిన్నాక పశువులు, జీవాల్లో నీరసం వంటి లక్షణాలు 3 – 8 గంటల్లో కనిపిస్తాయి. ఒక్కసారిగా మందలో ఎక్కువ శాతం జీవాలు ఎలాంటి లక్షణాలు లేకుండా మృత్యువాత పడతాయి. మేతలో నైట్రేట్ శాతం ఆధారంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి. కళ్లలో శ్లేష్మ పొర నీలి రంగులోకి మారడం, అధికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడడం, సరిగ్గా నిలబడలేక పోవడం, వణకడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. విరోచనాలు, సొల్లు కారడం, పొట్ట ఉబ్బరం, రక్తం మట్టి రంగులోకి మారడం వంటి లక్షణాల ద్వారా గుర్తించొచ్చు. చనిపోయే ముందు కాళ్లు గాలిలో కొట్టుకోవడం, ఫిట్స్ వంటివి కనిపిస్తాయి.
చికిత్స..
నైట్రేట్ విష ప్రభావాన్ని వెంటనే గుర్తిస్తే జీవాలను కాపాడుకోవచ్చు. జీవాలను ప్రభావిత పొలాల్లో మేపడం వెంటనే ఆపాలి. ఎండుగడ్డి, తగినంత నీరు అందించాలి. ప్రథమ చికిత్సగా బొగ్గుపొడిలో గుడ్డు, మెగ్నీషియం ఆకై ్సడ్, టాన్నిక్ ఆమ్లం కలిపి తాగించాలి. ఆపై పశువైద్యుల సలహా మేరకు మందులను వాడాలి.
నివారణ..
లేత జొన్న, మొక్కజొన్న మేయకుండా చూడాలి. కరువు తర్వాత, మబ్బు పట్టిన రోజుల్లో కోసిన మొక్కజొన్న కాడలను మేతగా వేయొద్దు. మేతలో నత్రజని శాతం మట్టి, వాతావరణంపై ఆధారపడి ఉంటుంది. ఒకే గ్రామంలోని మొక్కజొన్న పొలంలో మేసి పశువులు, జీవాలు అనారోగ్యానికి గురైతే ఆ గ్రామంలోని ఇతర పొలాల్లోనూ మేతకు వదలొద్దు. వర్షాలు కురిసిన వారం వరకు పశువులకు మొక్కజొన్న, జొన్నను మేపకూడదు. లేత ఆకుల్లోనే కాక ముదిరిన కాండంలోనూ ఎక్కువ శాతం నత్రజని ఉంటుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని మొక్కజొన్న కోత తర్వాత పశువులను మేపేటప్పుడు జాగ్రత్త వహించాలి. పొలాలకు నత్రజనిని వినియోగించిన కొన్ని రోజుల వరకు పశువులను మేపకపోవడం మేలు.


