భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలి.. | - | Sakshi
Sakshi News home page

భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలి..

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: బాలికను వేధించి అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేయాలని మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్‌ చేశారు. ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడారు. కేంద్ర మంత్రిగా చట్టాన్ని కాపాడాల్సిన బండి సంజయ్‌ ఆయన కుమారుడు తప్పును రాజకీయ కుట్రగా చిత్రీకరించడం దుర్మార్గమన్నారు. అలాంటి వ్యక్తి మంత్రి పదవిలో కొనసాగే అర్హత లేనందున రాజీనామా చేయకపోతే మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కాగా, బాధితురాలిని రాత్రి 12 గంటల వరకు స్టేషన్‌లో ఉంచి, ఆమైపెనే తప్పుడు కేసు పెట్టడం పోలీసు వ్యవస్థ ఎంతగా దిగజారిందో తెలియజేస్తోందన్నారు. భగీరథ్‌ను అరెస్ట్‌ చేయాలనే డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలపనున్నట్లు వెల్లడించారు. కాగా, వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో నిబంధనలను సడలించి పంట మొత్తం కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన పోరాటాలు ఉధృతం చేస్తామని రంగారావు హెచ్చరించారు. ఈ సమావేశంలో పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శిరోమణి, నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు, సీ.వై.పుల్లయ్య, జి.రామయ్య, ఆవుల అశోక్‌, ఝాన్సీ, శోభ తదితరులు పాల్గొన్నారు.

మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి రంగారావు

Advertisement
 
Advertisement
Advertisement