ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని స్వయంభూ శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం స్వామివారు శ్రీ స్తంభోద్భవ దర్శనం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు బారులుదీరి స్వామిని దర్శించుకున్నారు. కాగా, స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం సాయంత్రం గిరి ప్రదక్షిణ నిర్వహించనున్నారు. స్వామివారి ఉత్సవ మూర్తులను కొండపై నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి గిరి ప్రదక్షిణ చేయిస్తారు. ఆ తర్వాత రాత్రి 7–30గంటలకు కొండపై అర్చకులు స్వాతి నక్షత్ర జ్యోతి వెలిగిస్తారని ఈఓ కె.జగన్మోహన్‌రావు తెలిపారు.
ఏదులాపురం కమిషనర్‌గా మళ్లీ శ్రీనివాసరెడ్డి
ఖమ్మంరూరల్: ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ మున్వర్ అలీ గురువారం బదిలీ అయ్యారు. ప్రభుత్వం పలువురు కమిషనర్లను బదిలీ చేయగా, ఆయనకు స్థానం కలిగింది. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఇక్కడ కమిషనర్‌గా ఉన్న ఆళ్ల శ్రీనివాసరెడ్డిని నల్లగొండ జిల్లా హాలియా కమిషనర్‌గా బదిలీ చేయగా, తిరిగి ఏదులాపురానికే కేటాయించారు.
●వైరా: వైరా కమిషనర్‌గా ఎనిమిది నెలల నుంచి విధులు నిర్వర్తిస్తున్న యు.గురులింగం సైతం బదిలీ అయ్యారు. ఆయనను నల్లగొండ జిల్లా చిట్యాలకు బదిలీ చేయగా, వైరాలో మాత్రం ఎవరినీ నియమించలేదు. ఒకరిద్దరు అధికారుల పేర్లు ప్రతిపాదించిన అధికార పార్టీ నాయకులు వారిలో ఒకరిని కమిషనర్‌గా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
●కల్లూరు రూరల్: కల్లూరు మున్సిపాలిటీ కమిషనర్‌గా సీహెచ్.రాజశేఖర్ నియమితులయ్యారు. గతంలో ఇక్కడ పనిచేసిన రామదుర్గారెడ్డి బదిలీపై వెళ్లాక ఎవరినీ నియమించకపోవడంతో పోస్ట్ ఖాళీగా ఉంది. ప్రస్తుతం గ్రూప్–1 అధికారి అయిన రాజశేఖర్‌ను కేటాయించారు.
మొక్కజొన్నల కొనుగోళ్లు వేగవంతం చేయాలి
ఎర్రుపాలెం: నిర్దేశిత కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య ఆదేశించారు. ఎర్రుపాలెంలోని మార్కెట్ గోదాంలో కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన తనిఖీ చేసి మాట్లాడారు. కేంద్రాల్లో కొనుగోలు చేసిన మక్కలను మార్కెట్ గోదాంల్లో దిగుమతికి త్వరలోనే అనుమతులు జారీ చేస్తామని తెలిపారు. అనంతరం ఎర్రుపాలెం, రాజులదేవరపాడు, రాజుపాలెంల్లోని ఎరువుల దుకాణాలను డీఏఓ తనిఖీ చేశారు. ఇటీవల కాంప్లెక్స్ ఎరువుల ధరలు పెరిగినా, డీలర్లు పాత స్టాక్‌ను కొత్త ధరలతో అమ్మొద్దని సూచించారు. ఏఓ బి.సాయిశివ, ఏఈఓలు కె.వంశీ, ఏ.బాలకృష్ణ, సొసైటీ సీఈఓ బి.శివారెడ్డి పాల్గొన్నారు.
‘ఎర్లీ’గా రూ.12 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లు
● గతేడాదితో పోలిస్తే
రూ.కోటికి పైగా అదనం
ఖమ్మంమయూరిసెంటర్: ఆస్తి పన్ను చెల్లింపునకు ప్రభుత్వం ప్రకటించిన ఎర్లీ బర్డ్ స్కీంకు ఖమ్మం నగర వాసుల నుండి మంచి స్పందన లభించింది. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నును ఏప్రిల్ 30వ తేదీలోగా చెల్లిస్తే ఐదు శాతం రాయితీ ప్రకటించారు. దీంతో గడువు ముగిసే సమయానికి ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ద్వారా రూ.12 కోట్ల మేర పన్నులు వసూలయ్యాయి. 2025–26 ఆర్థిక సంవత్సరంలో ఎర్లీ బర్డ్ స్కీం ద్వారా రూ.10.94 కోట్లు వసూలు కాగా, ఈసారి 17,500 అసెస్‌మెంట్ల ద్వారా రూ.12 కోట్లు వసూలయ్యాయని అధికారులు వెల్లడించారు. కాగా, గతేడాది మాదిరిగా ఇంకొద్దిరోజులు గడువు పొడిగిస్తే మరో రూ.50 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని భావిస్తున్నారు.


