పుట్టకోట జెడ్పీహెచ్‌ఎస్‌లో హ్యాట్రిక్
● ఎస్సెస్సీలో సత్తా చాటిన ప్రభుత్వ విద్యార్థులు ● కొదుమూరు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థికి 585 మార్కులు
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరిచారు. జిల్లాలో 425 ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలలు ఉండగా... 108 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదుకావడం విశేషం.
టాప్ మార్కులు
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తీర్ణత సాధించిన వారిలో పలువురు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించారు. చింతకాని మండలం కొదుమూరు జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థిని షేక్ అబ్దుల్ కలాం 585 మార్కులతో మొదటి స్థానాన నిలిచాడు. ఆతర్వాత ఏన్కూరు టీజీఆర్‌ఎస్ విద్యార్థిని చంద సాత్విక్ 583మార్కులు, తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థి మేకల జ్ఞానేశ్వరి 581, కల్లూరు బాలికల పాఠశాల విద్యార్థిని రమణ శివనందిని 579, ఖమ్మం అర్బన్ ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థిని కిల్లంపల్లి హాసిని 578, సత్తుపల్లి మండలం సదాశివునిపాలెం విద్యార్థిని గూడే లాస్యప్రసన్న 578, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు విద్యార్థిని మూడ్ భరత్ 577, ముదిగొండ మండలం ఎడవల్లి పాఠశాల విద్యార్థి దుశర్ల యశ్వంతి 575, కల్లూరు బాలికల స్కూల్ విద్యార్థిని షేక్ ఫరీదా 575, ఖమ్మం అర్బన్ ఎన్నెస్సీ కాలనీ స్కూల్ విద్యార్థిని వేముల రేవతి 574మార్కులతో మొదటి పది స్థానాల్లో నిలిచారు. ఇక ఏన్కూరు, చింతకాని, సింగరేణి కేజీబీవీల విద్యార్థినిలు కొరివి నందిత, క్యాతం అక్షయ, పున్నద హాసిని వరుసగా 575, 561, 556 మార్కులు సాధించారు. అలాగే, మోడల్ స్కూళ్లకు వచ్చేసరికి టేకులపల్లి, కారేపల్లి విద్యార్థులులోకేశ్వరి 571, నడికొప్పుల లావణ్య 562, మందాల మీనాక్షి 561మార్కులు సాధించి మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తుంచడమే కాక నిరంతరం పర్యవేక్షణతో ఉత్తమ ఫలితాలు సాధ్యమయ్యాయని జిల్లా విద్యాశాఖాధికారి చైతన్యజైనీ వెల్లడించారు.
ఖమ్మం అర్బన్: ఖమ్మం నగర పరిధిలోని పుట్టకోట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో వరుసగా మూడో ఏడాది సైతం పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. పాఠశాల నుంచి 14మంది పరీక్షలకు హాజరుకాగా అందరూ ఉత్తీర్ణత సాధించారు. ఖమ్మం అర్బన్, రఘునాథపాలెం మండలాల పరిధిలోని 31 ప్రభుత్వ పాఠశాలల్లో పుట్టకోట పాఠశాలలోనూ నూరు శాతం ఫలితాలు సాధించడం విశేషమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు హెచ్‌ఎం ఎస్.జ్యోతి, ఉపాధ్యాయులు గురువారం స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఉపాధ్యాయులు రామకృష్ణ, చెన్నారెడ్డి, పాపారావు, శ్రీనివాసరాజు, సుజాత, సుదర్శనాచారి, వసంతరావు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


