సద్వినియోగం చేసుకోవాలి..
● నేటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ● లబ్ధిదారుల ఇళ్ల వద్దే సరుకుల పంపిణీ
ఖమ్మం మయూరిసెంటర్: వేసవి నేపథ్యాన భానుడు ప్రతాపాన్ని చూపిస్తుండడంతో జిల్లా నిప్పుల కొలిమిలా మారుతోంది. గత కొద్దిరోజులుగా 40 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోనే కాక రాష్ట్రమంతటా ఇదే పరిస్థితి ఉండడంతో అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎండల తీవ్రత దృష్ట్యా మే 1వ తేదీ(శుక్రవారం) నుంచి 31వ తేదీ వరకు కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించింది. అయితే, సెలవులు ప్రకటించినా లబ్ధిదారులకు పోషకాహారం విషయంలో అంతరాయం ఏర్పడకుండా ఇంటి వద్దకే సరుకులు అందించాలని ఆదేశించింది.
వడదెబ్బ ముప్పు తప్పించేందుకే..
అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మధ్యాహ్న భోజనం, గుడ్లు, పాలు అక్కడే అందజేస్తారు. కానీ ప్రస్తుతం నమోదవుతున్న ఎండల వేళ చిన్నారులు బయటకు వస్తే వడదెబ్బ తగిలే ప్రమాదం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. ఈనేపథ్యాన ఐసీడీఎస్ యంత్రాంగం మే నెల మొత్తం కేంద్రాలను మూసివేసి, లబ్ధిదారులకు కోటా ఆధారంగా సరుకులను ఇళ్లకే చేర్చాలని నిర్ణయించింది.
నెలకు సరిపడా ఒకేసారి..
మే 1వ తేదీ నుంచి జిల్లాలోని అన్ని కేంద్రాల పరిధిలో లబ్ధిదారులకు పౌష్టికాహారంలో భాగమైన సరుకులు పంపిణీ చేయనున్నారు. ఏడు నెలల నుంచి మూడేళ్ల లోపు పిల్లలకు బాలామృతం ప్యాకెట్లు, కోటా ప్రకారం కోడిగుడ్లు, పాల ప్యాకెట్లు అందిస్తారు. అలాగే, 3 నుండి 6 ఏళ్ల లోపు పిల్లలతో పాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన బియ్యం, కందిపప్పు, వంట నూనె ఇంటికే పంపించనున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో లబ్ధిదారులకు సరిపడా సరుకులు అందించేలా జిల్లా సంక్షేమ శాఖ అధికారులు దృష్టి సారించారు. గడువు ముగియడానికి సమీప తేదీతో ఉన్న సరుకులు కాకుండా నాణ్యమైనవి అందించాలని కార్యకర్తలను ఆదేశించారు. అంతేకాక లబ్ధిదారులకు సరుకులు అందించాక వారి సంతకాలు లేదా వేలిముద్రలు సేకరించాలని తెలిపారు.
ఎండల దృష్ట్యా ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ఇచ్చింది. ఈ నెలపాటు లబ్ధిదారులకు కావాల్సిన పోషకాహారం, సరుకులను ఇళ్ల వద్దే అందిస్తాం. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి. సరుకుల పంపిణీపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది.
– వేల్పుల విజేత, జిల్లా సంక్షేమ అధికారి


