గడువుతో పాటు నాణ్యతా ముఖ్యమే.. | - | Sakshi
Sakshi News home page

గడువుతో పాటు నాణ్యతా ముఖ్యమే..

May 1 2026 6:15 AM | Updated on May 1 2026 6:15 AM

● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ● రిటైనింగ్‌ వాల్‌తో పాటు తీగల వంతెన పనులు పరిశీలన

● కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ● రిటైనింగ్‌ వాల్‌తో పాటు తీగల వంతెన పనులు పరిశీలన

ఖమ్మంఅర్బన్‌: మున్నేటికి ఇరువైపులా రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణ పనులను గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. ఆదేశించారు. ఇదే సమయాన నాణ్యతను నిత్యం పర్యవేక్షించాలని తెలిపారు. ఖమ్మంలో రిటైనింగ్‌ వాల్‌, తీగల వంతెన నిర్మాణ పనులతో పాటు భూనిర్వాసితుల కోసం ఏర్పాటు చేస్తున్న లేఔట్‌ వెంచర్‌ అభివృద్ధి పనులను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రాజీవ్‌ గృహకల్ప, రంగనాయకగుట్ట, ప్రకాష్‌ నగర్‌ చెక్‌డ్యామ్‌ ప్రాంతాలను పరిశీలించిన కలెక్టర్‌ అధికారులతో సమీక్షించారు. నిపుణుల కమిటీ సూచించిన డిజైన్ల ప్రకారం రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం నాణ్యతతో జరగాలని సూచించారు. బైపాస్‌ నుంచి తీగల వంతెన వరకు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణం యుద్ధప్రాతిపదికన చేపట్టాలని స్పష్టం చేశారు. మిగిలిన చోట్ల కూడా భూ సేకరణ వేగవంతం చేయాలని, ఇదే సమయాన నిర్వాసితులకు ఇచ్చే లేఔట్‌ను సిద్ధం చేయాలని చెప్పారు. తీగల వంతెన నిర్మాణంలో ఎవరూ నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్‌ కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య, జలవనరులశాఖ, ఆర్‌అండ్‌బీ సీఈలు ఎం.వెంకటేశ్వర్లు, యాకూబ్‌, వివిధ శాఖల అధికారులు అనన్య, రమేష్‌రెడ్డి, ఉదయ్‌ప్రతాప్‌, వాణి, పుష్పలత, శ్రీనివాస్‌, జయచందర్‌, వినయేందర్‌రెడ్డి, టీఎన్జీవోస్‌ అధ్యక్షుడు శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో వేగం

ఖమ్మంగాంధీచౌక్‌: జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తయ్యేలా అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌ సూచించారు. కలెక్టరేట్‌లో గురువారం ఆయన అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో కలిసి నిర్మాణాల పురోగతిపై సమీక్షించారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా 10వేల ఇళ్ల పూర్తికి కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. జిల్లాలో మొదటి విడతగా మంజూరైన 16,497 ఇళ్లలో 2,520 పూర్తికాగా, మిగతావి కూడా పూర్తిచేసేలా లబ్ధిదారులకు సహకరించాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ పీడీ బి.శ్రీనివాస్‌, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement