ఖమ్మంవైరారోడ్: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేస్తున్న మోసాలకు ప్రజలు విసిగిపోయారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ తెలిపారు. దీంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. ఖమ్మం నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం బుధవారం జరగగా పువ్వా డ మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్షంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ప్రశ్నలను తట్టుకోలేక అధికార పార్టీ సస్పెండ్ చేసిందని ఎద్దేవా చేశారు. అంతేకాక కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేయలేక బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన పనులనే వారి పనులుగా చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని తెలిపారు. మట్టి గుట్టలు అమ్ముకున్నట్లు తనపై నిందలు వేసిన వారు ఇప్పటివరకు ఎందుకు నిరూపించలేదో చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జిల్లాలో మాయమైన గుట్టలపై ఏం సమాధానం చెబుతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నరేళ్లు గడిచినా చేసిందేమీ లేదని ప్రజలకు అర్థం కావడంతో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని పువ్వాడ తెలిపారు. పార్టీ శ్రేణులు ధైర్యంగా ఉండాలని సూచించారు. బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, డీసీసీబీ, మార్కెట్, సుడా మాజీ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, గుండాల కృష్ణ, బచ్చు విజయ్‌కుమార్‌తో పాటు బీరెడ్డి నాగచంద్రారెడ్డి, కార్పొరేటర్ మక్బూల్ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్


