డీఎంహెచ్‌ఓ డాక్టర్ రామారావు
ఖమ్మంవైద్యవిభాగం: అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లలో పీసీపీఎన్‌డీటీ–1994 చట్టాన్ని తప్పక అమలుచేయాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎంహెచ్‌ఓ డి.రామారావు హెచ్చరించారు. ఖమ్మంలోని డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో లింగ నిష్పత్తి తగ్గకుండా గర్భస్రావాలు, లింగ నిర్ధారణ పరీక్షల కట్టడికి పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అర్హత కలిగిన రేడియాలజిస్ట్ లేదా గైనకాలజిస్ట్ మాత్రమే స్కాన్ కేంద్రాలను నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. కాగా, ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు వారి పరిధిలో గర్భం దాల్చిన మహిళల వివరాలు నమోదు చేసి ప్రసవం వరకు పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం జిల్లాలోని అల్ట్రాసౌండ్ కేంద్రాల నుంచి అందిన 14 దరఖాస్తులపై చర్చించి కలెక్టర్ ఆమోదానికి పంపించాలని నిర్ణయించారు. డీసీహెచ్‌ఎస్ రాజశేఖర్, అదనపు డీఎంహెచ్‌ఓ చందునాయక్, పీడియాట్రిక్స్ విభాగాధిపతి బాబురత్నాకర్, డీపీఆర్‌ఓ గౌస్, డీసీపీఓ విష్ణువందన, ఐఎంఏ అధ్యక్షురాలు రెహనాబేగం తదితరులు పాల్గొన్నారు.
క్రమం తప్పక మందులు వాడాలి
హెచ్‌ఐవీ బారిన పడినవారు క్రమం తప్పకుండా మందులు వాడుతూ పౌష్టికాహరం తీసుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డి.రామారావు సూచించారు. ఆశా పాజిటివ్ పీపుల్ అసోసియేషన్ కేర్, సపోర్ట్ సెంటర్ ఆధ్వర్యాన మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. తొలుత హెచ్‌ఐవీ పాజిటివ్ బాధితులు మాట్లాడాక డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. బాధితుల కోసం ప్రభుత్వ పథకాలన్నీ సమర్థవంతంగా అమలు చేసుప్తన్నామని తెలిపారు. ఆశా పాజిటివ్ పీపుల్ అసోసియేషన్ ప్రాజెక్టు మేనేజర్ ఎన్.శంకర్, సీనియర్ వైద్యాధికారులు మోహన్‌రావు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.


