నేలకొండపల్లి ఎంఈఓ, చిలుకోడు ప్రిన్సిపాల్‌కు అవకాశం
ఖమ్మం సహకారనగర్/నేలకొండపల్లి: ఫిన్‌ల్యాండ్ దేశంలో అత్యుత్తమ ప్రమాణాలతో అమలవుతున్న విద్యావ్యవస్థ అధ్యయనానికి రాష్ట్రం నుంచి బృందం వెళ్లనుంది. రాష్ట్రంలోని వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు 28 మందితో పాటు 18 మంది అధికారులతో ఈ బృందాన్ని ఏర్పాటుచేశారు. ఇందులో నేలకొండపల్లి మండల విద్యాశాఖాధికారి బాలిన చలపతిరావుకు అవకాశం దక్కింది. అంతేకాక ఖమ్మం వాసి, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం చిలుకోడు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణభాను కూడా ఎంపికయ్యారు. ‘టీచర్స్ ఎక్స్‌పోజర్ విజిట్’ పేరుతో ఈ బృందం సభ్యులు ఏప్రిల్ 20నుంచి 24వ తేదీ వరకు ఫిన్‌ల్యాండ్‌లో విద్యావ్యవస్థను అధ్యయనం చేయనున్నారు. మొదటి రెండు రోజులు ఫిన్‌ల్యాండ్ యూనివర్సిటీలో శిక్షణ తీసుకున్నాక, చివరి రెండు రోజులు పాఠశాలల్లో బోధనా విధానాలు, ఫలితాలను పరిశీలిస్తారు. కాగా, బృందంలో స్థానం దక్కించుకున్న కృష్ణభాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 892 పీఎంశ్రీ పాఠశాలల్లో చిలుకోడు మోడల్ స్కూల్‌ను మొదటిస్థానాన నిలిపారు. ఆమె భర్త డాక్టర్ పాపబండ్ల రఘునందన్ జిల్లాలో పీడీగా విధులు నిర్వర్తిస్తున్నారు.


