ఈ ఏడాది వసూళ్లు కష్టమే.. | - | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది వసూళ్లు కష్టమే..

Mar 30 2026 8:43 AM | Updated on Mar 30 2026 8:43 AM

మార్కెట్ల వారీగా పన్నుల లక్ష్యం,

వసూళ్ల వివరాలు (రూ.కోట్లలో)

మార్కెట్ల పన్నుల లక్ష్యం రూ.69.37కోట్లు

గడువు సమీపించినా వసూలైంది రూ.45.16 కోట్లే

నిర్లక్ష్యంపై ఆగ్రహంగా ఉన్నతాధికారులు

ఖమ్మంవ్యవసాయం: పన్నుల వసూళ్లలో వ్యవసాయ మార్కెట్లు బాగా వెనకబడ్డాయి. మార్కెటింగ్‌ శాఖ నిర్దేశించిన లక్ష్యానికి జిల్లాలోని పలు మార్కెట్లు అందనంత దూరాన నిలిచాయి. జిల్లాలో సాగయ్యే పంటలు, ధరలు, ఇతర వనరుల ఆధారంగా వ్యవసాయ మార్కెట్ల వారీగా పన్నుల లక్ష్యాలను నిర్దేశిస్తుంది. వీటిని వసూలు చేయడానికి ఇంకా రెండు రోజుల సమయమే ఉన్నా లక్ష్యాన్ని సాధించే పరిస్థితులు కానరావడం లేదు.

ఎనిమిది మార్కెట్లు, 21చెక్‌ పోస్టులు

జిల్లాలో ఖమ్మం ప్రధాన మార్కెట్‌ కాగా, మధిర, నేలకొండపల్లి, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి, మద్దులపల్లి వ్యవసాయ మార్కెట్లు కూడా ఉన్నాయి. వీటి పరిధిలో 21 చెక్‌పోస్టులు కొనసాగుతున్నాయి. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ ఎనిమిది వ్యవసాయ మార్కెట్లకు బకాయిలతో కలిపి ఈ ఏడాది (2025–26)కి రూ.69.37 కోట్ల పన్నులను లక్ష్యంగా నిర్దేశించింది. అయితే, ఇందులో ఇప్పటి వరకు రూ. 45.16 కోట్లే వసూలు చేయగలిగారు. కల్లూరు మార్కెట్‌ మినహా మిగిలిన అన్నీ బాగా వెనకబడిపోవడం గమనార్హం.

రెండు రోజులే గడువు

రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ ఆర్థిక సంవత్సరం మార్కెట్లు చేరే పరిస్థితి కనిపించటం లేదు. జిల్లాలోని ఎనిమిది మార్కెట్ల పరిధిలో రూ.69.37కోట్లకు రూ.45.16 కోట్లు వసూలు కాగా ఇంకా రూ.24 కోట్లకు పైగా పైచిలుకు బకాయి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు రోజులే గడువు ఉన్నందున వసూళ్లు కష్టమేనని తెలుస్తోంది. గడిచిన రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది కమిటీలు లక్ష్యానికి దూరంగా నిలిచాయి. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ. 57.80 కోట్లు, 2024–25లో రూ.65.56 కోట్లు వసూలు చేయగా, ఈ ఏడాది గడువు ముగిసే సమయానికి రూ. 45.16 కోట్లే వసూలు చేయగలగడం గమనార్హం. గత ఏడాది యాసంగి నుంచి ఈ ఏడాది వానాకాలం పంటల వరకు వ్యవసాయ మార్కెట్లు పంటల క్రయవిక్రయాలపై వ్యాపారులు, కొనుగోలుదారుల నుంచి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పౌరసరఫరాల శాఖ(రాష్ట్ర ప్రభుత్వం), పత్తి కొనుగోలు చేసిన సీసీఐ(కేంద్రప్రభుత్వం) నుంచి కూడా పన్నులు అందకపోవడం లక్ష్యసాధనలో ఆటంకంగా మారినట్లు తెలుస్తోంది. ఇందులో ధాన్యానికి సంబంధించి సుమారు రూ.7కోట్ల బకాయిలు ఉన్నట్లు సమాచారం.

ఉన్నతాధికారులు సీరియస్‌..

మార్కెట్‌ ఫీజు లక్ష్యసాధనలో వెనకబడడంపై ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి, వరంగల్‌ రీజియన్‌ మార్కెటింగ్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ లక్ష్మణుడు జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారులు, మార్కెట్‌ కార్యదర్శులతో జూమ్‌ మీటింగ్‌ ద్వారా సమీక్షించి వివరణ అడిగినట్లు తెలిసింది. అంతేకాక పలువురు అధికారులు, కార్యదర్శులను మందలించినట్లు సమాచారం. వసూళ్లలో పురో గతి లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది.

వ్యాపారుల మొండి‘చేయి’

జిల్లాలో పంటలు కొనుగోలు చేసే కొందరు ప్రధాన వ్యాపారుల నుంచి రూ. కోట్లలో పన్నులు వసూలు కావాల్సి ఉంది. వీరిని మార్కెట్‌ అధికారులు కలిసి మాట్లాడినా ఫలితం కానరావడం లేదు. ఇందులో పలువురు రాజకీయ నాయకులుగా చెలామణి అవుతుండడమే కాక ప్రభుత్వ పెద్దల మనుషులుగా చెప్పుకుంటూ పన్నుల చెల్లింపునకు మొండికేస్తున్నట్లు తెలిసింది. తద్వారా వీరి తీరు తలనొప్పిగా మారిన విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.

మార్కెట్‌ లక్ష్యం ఇప్పటివరకు శాతం

వసూళ్లు

ఖమ్మం 35.32 17.60 49.84

వైరా 6.29 5.26 83.56

సత్తుపల్లి 5.12 4.37 85.32

మధిర 5.01 4.00 80.07

ఏన్కూరు 4.96 2.07 41.70

నేలకొండపల్లి 4.00 3.08 76.77

మద్దులపల్లి 3.23 2.98 92.56

కల్లూరు 5.44 5.80 106.50

మొత్తం 69.37 45.16 65.10

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement