ఆగండి.. చూసి వెళ్లండి | - | Sakshi
Sakshi News home page

ఆగండి.. చూసి వెళ్లండి

Mar 30 2026 8:43 AM | Updated on Mar 30 2026 8:43 AM

రోడ్డుపై గుంతలు, పెరిగిన ట్రాఫిక్‌తో అవస్థలు

తాత్కాలిక మరమ్మతులతోనే సరిపెడుతున్న యంత్రాంగం

అడుగడుగునా గుంతలు

పెరిగిన ట్రాఫిక్‌

హైదరాబాద్‌ తదితర నగరాల నుంచి ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఈ రహదారి మీదుగానే వెళ్లాల్సి ఉంటుంది. ఇటు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి హైదరాబాద్‌, హైదరాబాద్‌ నుంచి ఆయా ప్రాంతాలకు నిత్యం ఆర్టీసీ బస్సులే కాక లారీలు, కార్లు తిరుగుతుంటాయి. సరుకు రవాణాకు ఇది ప్రధాన మార్గం కావడంతో రాత్రీపగలు తేడా లేకుండా రద్దీ ఉంటుంది. అయితే, ఇది సింగిల్‌ రోడ్డు కావడంతో కాస్త ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలకు అవకాశం ఏర్పడుతోంది. జిల్లా మీదుగా ఇతర రాష్ట్రాలకు సరుకు రవాణా చేసే లారీల డ్రైవర్లు త్వరగా వెళ్లాలనే ఉద్దేశంతో వేగంగా నడపడంతో ప్రమాదాలకు కారణమవుతున్నారు.

ఇక్కడే ప్రమాదాలు..

ఖమ్మం–తల్లాడ రహదారిలో జరుగుతున్న ప్రమాదాల కారణంగా కొందరు మృత్యువాత పడుతుండగా.. మరికొందరు దివ్యాంగులుగా మిగులుతున్నారు. ప్రధానంగా తనికెళ్ల, కొణిజర్ల ప్రధాన రహదారి, వైరా రింగ్‌ సెంటర్‌, వైరా బ్రిడ్జి, తల్లాడ సెంటర్లలో ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. ఆయా ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్లను గుర్తించి హెచ్చరికల బోర్డులు, ఇతర చర్యలు చేపడతామని చెప్పినా ప్రమాదాలు తగ్గడం లేదు. దూరప్రాంతాల నుంచి వస్తున్న వాహనదారులకు రహదారిపై అవగాహన లేక అతివేగంగా వెళ్తూ గుంతలను తప్పించే క్రమాన ఇతర వాహనాలను ఢీకొడుతున్నారు. గతంలో జిల్లాలో హామ్‌ (హైబ్రిడ్‌ యాన్యుయిటీ మోడల్‌) రోడ్లు నిర్మిస్తామని చెప్పినా ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత తాత్కాలిక మరమ్మతులకే నిర్ణయించి.. హామ్‌ నిధులను జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో వినియోగించనున్నారు.

గ్రీన్‌ఫీల్డ్‌ హైవే మొదలైతేనే..

ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నేషనల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే పూర్తి కావాల్సి ఉన్నా పలు కారణాలతో ఆలస్యమైంది. ఈ హైవే అందుబాటులోకి వస్తే భారీ వాహనాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన వాహనాలన్నీ ఆ మార్గంలోనే వచ్చివెళ్తాయి. దీంతో ఖమ్మం – తల్లాడ రహదారిపై ట్రాఫిక్‌ తగ్గనుంది. ఈ రహదారి మే నెలలో హైవే అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నా... ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే సాధ్యమేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రమాదకరంగా ఖమ్మం–తల్లాడ రహదారి

ఖమ్మం నుంచి వి.వెంకటాయపాలెం వరకు నాలుగు లేన్ల రోడ్డు ఉన్నా ఆ తర్వాత సింగిల్‌ రోడ్డు ఉంటుంది. భారీ వాహనాల రాకపోకలతో రహదారిపై పలుచోట్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో రోడ్లు మరింతగా దెబ్బతిని గుంతల్లో నీరు నిలుస్తుండగా.. ఈ విషయాన్ని గుర్తించలేక వాహనదారులు ప్రమాదాలకు గురైన ఘటనలు ఉన్నాయి. ప్రధానంగా కొణిజర్ల సమీపాన అధ్వానంగా మారిన రోడ్డుపై గుంతలను తప్పించబోయి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. గుంతలు పెద్దవై, ప్రమాదాలు జరిగి విమర్శలు వచ్చినప్పుడే కంకర, ఇసుక, తారుతో తాత్కాలికంగా పూడుస్తుండడంతో కొద్దిరోజులకే సమస్య పునరావృతమవుతోంది. దీనికి తోడు తాత్కాలిక మరమ్మతులు చేయడంతో రోడ్డు ఓచోట ఎత్తుగా.. మరోచోట దిగుడుగా మారి వాహనదారులు అదుపు తప్పుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement