సమన్వయంతో..
● వసూళ్లపై కేఎంసీ ప్రత్యేక దృష్టి ● ఒకేరోజు రూ.2.48కోట్లు జమ
ఖమ్మం మయూరిసెంటర్: ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు రోజుల సమయమే ఉండడంతో ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలో వంద శాతం పన్నుల వసూళ్లే లక్ష్యంగా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా సెలవు రోజైన ఆదివారం కూడా కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది వసూళ్లలో నిమగ్నమయ్యారు. కొందరు కార్పొరేటర్లు సైతం అధికారులకు సహకరిస్తూ పన్నుల చెల్లింపులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. బకాయిలతో కలిపి ఈ ఏడాది రూ.62 కోట్లు వసూలు చేయాల్సి ఉన్నా, ఆర్థిక సంఘం నిధులకు అర్హత సాధించే లక్ష్యమైనా చేరేలా ప్రణాళిక రూపొందించారు.
సెలవు రోజున సైతం..
గడువు సమీపించిన నేపథ్యాన ఆదివారం కూడా కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశాలతో కేఎంసీలోని అన్ని విభాగాల అధికారులు విధులకు హాజరయ్యారు. రెవెన్యూ విభాగంతో పాటు ఇంజనీరింగ్, అకౌంట్స్, టౌన్ ప్లానింగ్, ప్రజారోగ్య విభాగాలకు చెందిన ఏఈలు, ఇన్‌స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లు వార్డుల్లో పర్యటిస్తూ భారీ బకాయిలు ఉన్న వారు చెల్లించేలా అవగాహన కల్పించారు.
మరో రూ.5.37 కోట్లు..
ఈ ఆర్థిక సంవత్సరం కేఎంసీ పన్నుల వసూళ్లలో గణనీయమైన పురోగతి సాధించినా, లక్ష్యాన్ని మాత్రం చేరలేదు. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఇప్పటివరకు రూ.33.83 కోట్ల మేర వసూలయ్యా యి. ఇందులో ఆదివారమే రూ.2.48 కోట్లు జమ అయ్యాయి. అయితే, ఆర్థిక సంఘం నిధుల సాధనకు అర్హత కోసం వసూలు చేయాల్సిన రూ.38 కోట్లలో ఇంకా రూ.4కోట్లకు పైగా వసూలు కావాలి. దీంతో మిగిలిన రెండు రోజుల్లో వసూలు చేయాలనే పట్టుదలతో అధికారులు శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యాన వసూళ్లలో వెనుకబడిన డివిజన్లపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతీ అధికారికి లక్ష్యాన్ని కేటాయించి రోజువారీ ఎంత వసూలు చేశారో ఆరా తీస్తున్నారు. అంతేకాక మొండి బకాయిదారులు చెల్లించని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు చేస్తున్నారు.
వసూళ్లలో వేగం పెంచేలా నగరంలోని ప్రధాన కూడళ్లలో ప్రత్యేక కేంద్రాలను రాత్రి వరకు తెరిచి ఉంచుతున్నారు. ఆస్తి పన్నుతో పాటు ఖాళీ స్థలాల పన్ను, నల్లా బిల్లుల బకాయిలు కూడా చెల్లించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈనెల 31వ తేదీ లోపు ఆస్తి పన్ను చెల్లించకపోతే ఏప్రిల్ 1–2 శాతం అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని వివరిస్తున్నారు. ఈసారి ప్రభుత్వం వడ్డీ రాయితీ కూడా ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ముందుగానే పన్ను చెల్లించి అదనపు భారం నుండి తప్పించుకోవాలని సూచిస్తున్నారు.


