● భద్రగిరి రామయ్య కల్యాణంలో కీలక ఘట్టం ● హిందూ, ముస్లిం మతసారమస్యం పెంపొందేలా భక్తులపై గులాల్ ● బ్రహ్మోత్సవాల్లో కమనీయంగా గరుడాధివాసం
భద్రాచలం: శ్రీసీతారాముల కల్యాణ ఘడియలు సమీపిస్తున్నాయి. కల్యాణ మహోత్సవంలో కీలకమైన ఎదుర్కోలు ఉత్సవం గురువారం సాయంత్రం నిర్వహించనున్నారు. ‘మా అందమైన రామయ్య వంశమే గొప్పది’ అంటూ కొందరు, మరో వైపు ‘చక్కని సీతమ్మ తల్లి వంశమే గొప్పది’ అంటూ మరికొందరు అర్చకులు సమూహాలుగా విడిపోయి లయబద్ధంగా నాట్యమాడుతూ మిథిలా స్టేడియంలో సందడి చేయనున్నారు. హిందూ ఆచారం ప్రకారం ప్రతి ఇంటా కల్యాణంలో ఎదుర్కోలు ఉత్సవం జరుపుతారు. ఆదర్శ జంటకు ప్రతీకలైన శ్రీ సీతారాముల పెళ్లి సందర్భంగా ఈ వేడుక నిర్వహించనున్నారు. మిథిలా స్టేడియం సీతమ్మవారికి మిథిలా నగరం కాగా, మరో పక్కనున్న వైకుంఠ ద్వారం రామయ్యకు చెందిన అయోధ్యగా అభివర్ణిస్తారు. హిందూ, ముస్లింల సామరస్యాన్ని పెంపొందించే విధంగా భక్తులందరికీ పన్నీరును చల్లడం ఈ ఉత్సవాల్లో ప్రత్యేకత. గోల్కొండ నవాబైన తానీషాను స్మరింపజేస్తూ భద్రాచల దేవస్థానంలో ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ జరపటం విశేషం. కాగా నవాహ్నిక తిరుకల్యాణోత్సవాలలో భాగంగా శుక్రవారం శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం, శనివారం పట్టాభిషేక మహోత్సవాలు జరపనున్నారు.
ధ్వజారోహణం, గరుడ ప్రసాదం పంపిణీ
బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా జరిపారు. శ్రీ మహా విష్ణువు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురవేశారు. ఉదయం యాగశాలలో తిరువారాధన సేవా కాలం, నివేదన, మంగళ శాసనం, తీర్థప్రసాద వినియోగం జరిపారు. అనంతరం ఎటువంటి విఘ్నాలు కలుగకుండా సేనాధిపతి, విఘ్ననాశకుడు అయిన విశ్వక్సేనార్చన జరిపి, కర్మణ, పుణ్యావాచనం, మూర్తి కుంభావాహన, భద్రక మండల ఆరాధన ద్వార తోరణ ఆరాధన జరిపి నవాహ్నిక దీక్షకు అగ్ని ప్రతిష్టాపన జరిపారు. యాగశాల నుంచి గరుడ పటాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలతో అర్చక పరిచారక వేద పండితులు తీసుకొని రాగా బ్రహ్మోత్సవ రక్షణ నిమిత్తం గరుడాళ్వారులను ఆహ్వానించి ఆరాధన చేశారు. గరుడ మహా సంకల్పం, గరుడ గద్యనం, గరుడ మంగళాష్టకములను తర్పానందంగాా ప్రధానార్చకులు చదవగా గరుడ పటాన్ని మంగళ వాయిద్య ఘోష నడుమ ధ్వజారోహణం చేశారు. అనంతరం బలిహరణం జరిగింది. సంతానం లేని వారికి గరుడ ముద్దలను ప్రసాదంగా అందజేశారు. గరుడ ముద్ద తీసుకున్న వారికి సంతానం కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. సాయంత్రం యాగశాలలో భేరీ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈఓ దామోదర్‌రావు దంపతులు, ఏఈఓలు శ్రవణ్‌కుమార్, భవాని రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు పొడిచేటి సీతారామానుజాచార్యులు, విజయరాఘవన్, స్థానాచార్యులు కేఈ స్థలశాయి, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.


