రూ.15కోట్ల ప్రగతి కానుక ! | - | Sakshi
Sakshi News home page

రూ.15కోట్ల ప్రగతి కానుక !

Mar 26 2026 7:27 AM | Updated on Mar 26 2026 7:27 AM

● ఫుట్‌పాత్‌లు, డ్రెయినేజీల నిర్మాణానికి కేటాయింపు ● భక్త రామదాసు కళాక్షేత్రం పునరుద్ధరణకు పచ్చజెండా

ఖమ్మం కార్పొరేషన్‌కు నిధుల మంజూరు
● ఫుట్‌పాత్‌లు, డ్రెయినేజీల నిర్మాణానికి కేటాయింపు ● భక్త రామదాసు కళాక్షేత్రం పునరుద్ధరణకు పచ్చజెండా

ఖమ్మంమయూరిసెంటర్‌: రాష్ట్రంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న నగరాల్లో ఒకటైన ఖమ్మంలో సుందరీకరణ పనులు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులను మంజూరు చేసింది. ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అత్యవసర, అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.15 కోట్లు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తూ మున్సిపల్‌ పరిపాలన శాఖ కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌(సీడీఎంఏ) నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. స్థానిక అవసరాలు, ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారం, ప్రజల జీవన ప్రమాణాల పెంపును దృష్టిలో ఉంచుకుని గత ఆర్థిక సంవత్సరపు ప్రత్యేక గ్రాంట్ల ప్రణాళికలో భాగంగా కమిషనర్‌ అభిషేక్‌ అగస్త్య పంపిన ప్రతిపాదనల ఆధారంగా ఈ పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది.

పక్కా ప్రణాళిక

కేఎంసీకి మంజూరైన రూ.15 కోట్ల నిధులతో వివిధ డివిజన్లలో ప్రాధాన్యత కలిగిన పది పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించారు. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌కు అనుగుణంగా వైరా రోడ్డు, ఇల్లెందు రోడ్డు, లకారం చెరువు పరిసర ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లు నిర్మించనున్నారు. వీటికి అనుసంధానంగా మురుగునీటి పారుదలను మెరుగుపరిచేందుకు డ్రెయిన్ల నిర్మాణం చేపడుతారు.

కళాకారుల కోసం..

ఖమ్మం నగర సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తున్న భక్త రామదాసు కళాక్షేత్రం ఆధునీకరణకు రూ.కోటి నిధులు కేటాయించడంపై కళాకారులు, సాహితీవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిధులతో కళాక్షేత్రంలో సౌకర్యాలు మెరుగుపడి మరిన్ని ప్రదర్శనలకు వేదిక కానుంది. కళాక్షేత్రం ఆధునికీకరణ చేశాక నిర్వహణ బాధ్యతలు, ఉద్యోగుల వేతనాలు చెల్లింపు కేఎంసీ ద్వారా చేపడతారు. ఇందుకోసం త్వరలోనే కళాక్షేత్రం నిర్వహణ కేఎంసీ పరిధిలోకి తీసుకోనున్నారు. అలాగే, నయాబజార్‌ ప్రాంతంలో నూతన షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణంతో కేఎంసీ శాశ్వత ఆదాయ వనరులు సమకూరనున్నాయి.

పర్యవేక్షణ బాధ్యతలు

అభివృద్ధి పనులకు నిధులు మంజూరుకావడంతో టెండర్ల ప్రక్రియ ప్రారంభించి పనులు నాణ్యతతో వేగంగా పూర్తయ్యేలా పర్యవేక్షించాలని మున్సిపల్‌ కమిషనర్‌ను సీడీఎంఏ డైరెక్టర్‌ ఆదేశించారు. అలాగే, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అటు కలెక్టర్‌, ఇటు కమిషనర్‌కు సూచించినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement