కోడి పైకి.. గుడ్డు కిందకు | - | Sakshi
Sakshi News home page

కోడి పైకి.. గుడ్డు కిందకు

Mar 16 2026 7:30 AM | Updated on Mar 16 2026 7:30 AM

పెరిగిన చికెన్‌ ధరలు..

గుడ్డు ధర పతనం

గత నెలతో పోలిస్తే రూ.100 వరకు పెరిగిన చికెన్‌ ధర

చాలాచోట్ల ఒక గుడ్డు రూ.4కే విక్రయం

ఖమ్మంవ్యవసాయం: చికెన్‌ ధరలకు రెక్కలొచ్చాయి. అలాగే, కోడిగుడ్డు ధర పతనమైంది. కోళ్ల ఉత్పత్తి తగ్గిపోవడంతో చికెన్‌ రేటు పెరిగిందని, గుడ్ల ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిందని వ్యాపారులు విశ్లేషిస్తున్నారు. డిసెంబర్‌, జనవరిలో క్రిస్మస్‌, నూతన సంవత్సరం, సంక్రాంతి, ఆ తరువాత మేడారం జాతర సందర్భంగా స్కిన్‌లెస్‌ చికెన్‌ కిలో రూ.300 మొదలు, రూ.350 వరకు పలికింది. ఇక ఫిబ్రవరిలో కిలోకు రూ.100 తగ్గి రూ.250కు దిగి వచ్చింది. మార్చి ఆరంభం నుంచి మళ్లీ చికెన్‌ ధరలు పెరుగుతున్నాయి. గత నెలతో పోలిస్తే కిలో చికెన్‌కు రూ.100 వరకు ధర పెరిగింది. మరో మూడు, నాలుగు రోజుల్లో రంజాన్‌ పండగ వస్తుంది. ఈ పండగ వేళ సహజంగా మాసం ధరలు కొంత పెరగటం సహజం. ప్రస్తుతం కోళ్ల ఉత్పత్తి ఆశాజనకంగా లేకపోవటంతో చికెన్‌ ధరలు మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపారులు విశ్లేషిస్తున్నారు.

గుడ్డు ధర తగ్గింది..

మూడు నెలల క్రితం రిటైల్‌ గుడ్డు ధర ప్రాంతాన్ని బట్టి రూ.8 నుంచి రూ.9 వరకు విక్రయించారు. ప్రస్తుతం రిటైల్‌ మార్కెట్‌లో రూ.5.50 నుంచి రూ.6కు విక్రయిస్తున్నారు. చలికాలంలో గుడ్డు వినియోగం ఎక్కువగా కాబట్టి ధర ఎక్కువగా ఉండటం.. వేసవిలో తగ్గడం సాధారణమే. కానీ, ధర సగానికి పడి పోయేంతగా ఎప్పుడూ తగ్గలేదు. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతుండటం, దేశం నుంచి గుడ్లు ఎగుమతికి చెక్‌ పడటంతో ఆ ప్రభావం గుడ్డు ధరపై పడిందని పౌల్ట్రీ పరిశ్రమల బాధ్యులు చెబుతున్నారు.

ఉత్పత్తి లేక..

వేసవిలో పౌల్ట్రీ యజమానులు కోళ్ల పెంపకానికి ఆసక్తి చూపరు. దీంతో కోళ్ల ఉత్పత్తి తగ్గింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిత్యం 80 నుంచి 90 టన్నుల చికెన్‌ వినియోగం ఉంటుందని అంచనా. జిల్లాలోని పరిశ్రమల్లో 60 లక్షల వరకు కోళ్లను పెంచే అవకాశాలు ఉండగా, ప్రస్తుతం 20 నుంచి 25 లక్షలకు మించి కోళ్లను పెంచడం లేదని సమాచారం. దీంతో వరంగల్‌, కరీంనగర్‌, ఏపీలోని విజయవాడ, రాజమండ్రి ప్రాంతాల నుంచి కోళ్లను దిగుమతి చేసుకుంటుడటంతో చికెన్‌ ధరకు రెక్కలొచ్చాయని చెబుతున్నారు. ఇక, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిత్యం 18 నుంచి 20 లక్షల వరకు గుడ్లు వినియోగిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కోడిగుడ్లు ఉత్పత్తి చేసే పరిశ్రమలు తక్కువ. కాగా, కోడిగుడ్డు ధర ఒక్కసారిగా పతనమవటం రైతులను కుంగదీస్తోంది. ప్రస్తుతం ఉన్న దానా ధర, నిర్వహణ ఖర్చులను పరిగణనలోకి తీసుకుంటే ఒక్క గుడ్డు ఉత్పత్తికి రూ.4.50 ఖర్చవుతోంది. ప్రస్తుతం గుడ్డు ధర రూ.4.20గా ఉండటంతో రూ.0.30 నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం లేయర్‌ కోళ్ల పరిశ్రమల నిర్వహణ నుంచి కనీస పెట్టుబడులు కూడా రాని పరిస్థితితులు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement