నేడు ఖమ్మానికి కేటీఆర్ రాక
ఖమ్మంవైరారోడ్: ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్లు కూల్చివేసిన నేపథ్యాన బాధితులను పరామర్శించేందుకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం వస్తున్నారని ఎమ్మెల్సీ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్ వెల్లడించారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 25 నెలల కాలంలో హామీల అమలులో విఫలమైందని ఆరోపించారు. అంతేకాక గత పదేళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని ధ్వంసం చేయడమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు. ఖమ్మం వెలుగుమట్లలో భూదాన్ ట్రస్ట్ బోర్డు ద్వారా పట్టాలు పొంది ఏళ్లుగా నివసిస్తున్న పేదల ఇళ్లను కూల్చివేయడం గర్హనీయమని పేర్కొన్నారు. వేల సంఖ్యలో పోలీసులను మోహరించి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారన్నారు. ఈమేరకు బాధిత కుటుంబాలను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం పరామర్శించి, భూదాన్ భూములను పరిశీలిస్తారని తెలిపారు. కాగా, బాధితులందరికీ తక్షణమే పునరావాసం కల్పించాలని, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని, ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని తాతా మధు డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్‌ఎస్ రఘునాథపాలెం మండలం, ఖమ్మం నగర అధ్యక్షులు బెల్లం వేణుగోపాల్, పగడాల నాగరాజు, డీసీసీబీ మాజీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నాయకులు బాషబోయిన వీరన్న, కర్నాటి కృష్ణ, మక్బూల్, బిచ్చాల తిరుమల్‌రావు, తాజుద్దీన్, పగడాల నరేందర్ తదితరులు పాల్గొన్నారు.
భూదాన్ బాధితులకు పరామర్శ


