యువత క్రీడా స్ఫూర్తిని చాటాలి..
ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి
ముగిసిన రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు
ఖమ్మంస్పోర్ట్స్: నేటి యువత, ప్రధానంగా విద్యార్థులు క్రీడలపై మరింత ఆసక్తి పెంచుకోవాలని ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి సూచించారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడా స్ఫూర్తిని చాటితే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. ఖమ్మం ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న సీఎం కప్ అండర్–19 బాలబాలికల రాష్ట్ర స్థాయి ఆర్చరీ పోటీలు శనివారం రెండో రోజుకు చేరగా ఎంపీ ప్రారంభించారు. అంతకుముందు సర్దార్ పటేల్ ఇండోర్ స్టేడియంలో ఫ్రెండ్స్ కప్ – 26 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీ మాట్లాడుతూ ఎంచుకున్న క్రీడలో ముమ్మర సాధన చేయడం ద్వారా విజయాలు సొంతమై బంగారు భవిష్యత్ ఉంటుందన్నారు. రాష్ట్రంలో క్రీడారంగం, క్రీడాకారుల అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. అథ్లెటిక్స్, క్రికెట్, బ్యాడ్మింటన్ ఆటల్లో తనకు ప్రవేశం ఉందని ఎంపీ గుర్తుచేసుకున్నారు.
ఆర్చరీ పోటీల విజేతలు వీరే..
రాష్ట్రస్థాయి సీఎం కప్ ఆర్చరీ పోటీల్లో విజేతలకు సాయంత్రం కలెక్టర్ అనుదీప్ బహుమతులు అందజేశారు. రికర్వ్ బాలుర విభాగంలో పి.నాగసాయి కృషివ్‌రెడ్డి(రంగారెడ్డి), ఏ.వెంకటేష్(వరంగల్), టి.వెంకట యోగీశ్వర్(ఖమ్మం) మొదటి మూడు స్థానాల్లో నిలిచి బంగారు, వెండి, కాంస్య పతకాలు గెలుచుకున్నారు. రికర్వ్ బాలికల విభాగంలో కె.లోహితశ్రీ(భద్రాద్రి కొత్తగూడెం), ఎన్.షన్విత(కరీంనగర్), బి.కృసారాణి(వరంగల్), కాంపౌండ్ బాలుర విభాగంలో కె.బూవన్ సాకేత్(మేడ్చల్), ఎన్.కృతిక్ శ్రీవాత్సవ్(మహబూబ్‌నగర్), వి.సంవర్ధన్‌రెడ్డి(హైదరాబాద్), బాలికల విభాగంలో ఆర్.హన్సికరావు(పెద్దపల్లి), ఎన్.స్మృతి సన్నిభ(మహబూబ్‌నగర్), ఎం.శ్రీనిక (నిజామాబాద్) వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. అలాగే, ఇండియన్ రౌండ్ బాలుర విభాగంలో కె.రాంచరణ్(భద్రాద్రి కొత్తగూడెం), టి.సునీల్‌కుమార్(నిర్మల్), ఆర్.భార్గవ్(ఖమ్మం), బాలికల విభాగంలో చిట్టె మాన్య(మేడ్చల్), జి.నిహారిక(నిర్మల్), సీహెచ్.రష్మితరెడ్డి(సిద్ధిపేట) మొదటి మూడు స్థానాలు దక్కించుకున్నారు. ఈకార్యక్రమాల్లో డీవైఎస్‌ఓ సునీల్‌రెడ్డి, ఏఎస్పీ వెంకట్రావు, మేయర్ పునుకొల్లు నీరజ, ఆర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, వైరా ఏసీపీ సాదుల సారంగపాణి, జాతీయ ఆర్చరీ డెవలప్‌మెంట్ సభ్యుడు పుట్టా శంకరయ్య, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి క్రిస్టోఫర్ బాబుతో పాటు వివిధ అసోసియేషన్ల బాధ్యులు రవిమారుత్, కమర్తపు మురళి, కొప్పుల చంద్రశేఖర్, సిరిపురపు సుదర్శన్, ఉమ్మినేని కృష్ణ, మురళి, సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు.
యువత క్రీడా స్ఫూర్తిని చాటాలి..


