హోల్‌సేల్‌గా దోచేస్తాం !
మెండుగా రాజకీయ అండ..
ఖమ్మం హోల్‌సేల్ కూరగాయల
మార్కెట్‌లో వ్యాపారుల ఇష్టారాజ్యం
భారీ ఎత్తున రేకుల షెడ్లు నిర్మించుకుని దందా
మార్కెట్ ఆదాయానికి
గండికొడుతున్నా పట్టని కమిటీ
నోటీసులతోనే సరిపెడుతున్న అధికారులు
నోటీసులు ఇచ్చాం..
వారు ఆడిందే ఆట !
ఖమ్మంలోని హోల్‌సేల్ కూరగాయల మార్కెట్‌ను రిటైల్, కమీషన్ వ్యాపారుల సౌకర్యార్థం నిర్మించారు. ఇక్కడ మొత్తం 48 హోల్‌సేల్, 269 రిటైల్ కూరగాయల దుకాణాలు ఉన్నాయి. హోల్‌సేల్ దుకాణాలను కమీషన్ వ్యాపారులు నిర్వహిస్తుండగా, జిల్లాతో పాటు భద్రాద్రి, సూర్యాపేట, మహబూబాబాద్, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని పలు ప్రాంతాల వ్యాపారులు కూరగాయలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి పలురకాల కూరగాయలు, దుంపలు, ఉల్లిగడ్డలు దిగుమతి అవుతుంటాయి. వీరే కాకుండా ఖమ్మం పరిసర ప్రాంతాల రైతులు పండించిన కూరగాయలను ఈ మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. వ్యాపారులు ఇక్కడ కొనుగోలు చేసి వివిధ ప్రాంతాల రీటైల్ వ్యాపారులకు అమ్ముతుంటారు. ఇదంతా బాగానే ఉన్నా.. కొందరు వ్యాపారులు ఆడిందే ఆట.. పాడిందే పాట చందంగా వ్యహరిస్తున్నారు.
భారీగా షెడ్ల నిర్మాణం..
కమీషన్ వ్యాపారులు ఒక్కో దుకాణానికి రూ.1,600 నుంచి రూ.3 వేలకు పైగా మార్కెట్ కమిటీకి అద్దె చెల్లిస్తున్నారు. అయితే కొందరు తమకు కేటాయించిన దుకాణాలు కాకుండా మార్కెట్‌లోని ఖాళీ ప్రాంగణంలో భారీగా షెడ్లు నిర్మించారు. అద్దె చెల్లించే దుకాణాలను కార్యాలయాలుగా మార్చుకుని, ఈ షెడ్లలో వ్యాపారం చేస్తున్నారు. మార్కెట్ ప్రాంగణంలో మొత్తంగా పదికి పైగా ఇలాంటి అక్రమ షెడ్లు వెలిశాయి. కూరగాయల లోడ్‌తో వచ్చిన వాహనాలను నిలపడం, కూరగాయల పెట్టెలను దించడం వంటివి ఇక్కడ చేస్తున్నారు. ఇలా షెడ్లు నిర్మించిన వారు అదనంగా ఒక్క రూపాయి కూడా మార్కెట్ కమిటీకి చెల్లించకపోవడం గమనార్హం. ఇదేంటని అడిగే వారు లేకపోవడంతో ఏకంగా మూడు, నాలుగు గదుల మాదిరిగా షెడ్లు నిర్మించారు. దీంతో మార్కెట్ ప్రాంగణమంతా ఇరుకుగా మారింది. ఇక రైతులు కూరగాయలు తెచ్చే వాహనాలను మాత్రం మార్కెట్ బయటే గంటల కొద్దీ నిలపాల్సి వస్తోంది.
మార్కెట్ ఫీజులోనూ మాయ..
నిత్యం రూ.లక్షల్లో లావాదేవీలు నిర్వహించే ఈ మార్కెట్‌లో రోజూ రూ.50 వేలకు పైగా పీజు వసూలు కావాలి. కానీ ఇందులో 10శాతం మాత్రమే చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమీషన్ వ్యాపారులు ఎక్కువ బిజినెస్ చేసి తక్కువగా చూపిస్తున్నారని తెలుస్తోంది. కొంతకాలంగా ఈ తంతు సాగుతున్నా మార్కెట్ కమిటీ దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. నామమాత్రపు పర్యవేక్షణతో కమీషన్ వ్యాపారులదే మార్కెట్‌లో పైచేయి అయిందనే ప్రచారం జరుగుతోంది. అక్రమ వ్యాపారం, మార్కెట్ ఫీజు తక్కువ చెల్లిస్తున్న విషయమై పలుమార్లు ఆ శాఖ ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది.
ఈ మార్కెట్‌లో వ్యాపారం చేస్తున్న కమీషన్ వ్యాపారులకు రాజకీయ అండదండలు మెండుగా ఉన్నాయి. దీంతో ఒకరిని చూసి మరొకరు తగ్గేదేలేదనట్లుగా ఇష్టారీతిన షెడ్లు నిర్మించారు. మార్కెట్ అదాయానికి గండికొడుతూ.. వారి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నా సంబంధిత కమిటీ, అధికారులు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం. రైతుల ఫిర్యాదులతో పలుమార్లు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ అధికారులు సదరు కమీషన్ వ్యాపారులకు నోటీసులు ఇచ్చినా ప్రయోజనం లేదు. గతంలో కొందరు రాజకీయ పలుకుబడితో ఒకటి, రెండు షెడ్లను నిర్మించగా.. ఇటీవల కాలంలోనే ఎక్కువగా వెలిశాయి. అంతేకాకుండా భారీ ఎత్తున ఈ షెడ్లు ఉండడంతో ఎవరూ వీరిని నియంత్రించలేరా.. అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
షెడ్లు నిర్మించిన వారికి కమిటీ నిర్ణయం మేరకు నోటీసులు ఇచ్చాం. కమిటీ ఇచ్చే ఆదేశాల ప్రకారం వారిపై చర్యలు ఉంటాయి. ఇష్టారీతిన నిర్మించడానికి ఎలాంటి అనుమతులు లేవు. కూరగాయల వ్యాపారం చేసుకోవడానికే మాత్రమే వారికి దుకాణాలు కేటాయించాం.
– పి.ప్రవీణ్‌కుమార్, ఉన్నత శ్రేణి కార్యదర్శి,
వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఖమ్మం
హోల్‌సేల్‌గా దోచేస్తాం !


