అంగన్‌వాడీల్లో ఇక వెలుగులు
● రూ.125కు నూతన మీటర్లు ● ఆపై ఉచిత విద్యుత్ కూడా..
అంగన్‌వాడీ భవనానికి అధికారులు విద్యుత్ మీటర్ ఏర్పాటు చేయడంతో కరెంట్ సమస్య తీరింది. ఏటా వేసవి కాలంలో చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులు ఉక్కపోతతో ఇబ్బంది పడేవారు. ప్రభుత్వం ఉచిత విద్యుత్ సరఫరా చేయగా స్థానికులు ఫ్యాన్లు అందించారు. దీంతో ఈ ఏడాది ఉక్కపోత కష్టాలు ఉండవని చిన్నారుల తల్లిదండ్రులు, బాలింతలు, గర్భిణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
–ఎం.మహాలక్ష్మి, అంగన్‌వాడీ టీచర్, బనిగండ్లపాడు
జిల్లాలోని ప్రభుత్వ అంగన్‌వాడీ భవనాలకు, రెంట్ ఫ్రీ భవనాలకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ మేరకు స్థానిక విద్యుత్ అధికారులకు ఆదేశాలందాయి. భవనాలకు విద్యుత్ సరఫరా చేయడంతో కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు వేసవికాలంలో ఇబ్బందులు ఉండవు.
– వేల్పుల విజేత, జిల్లా సంక్షేమాధికారి
ఎర్రుపాలెం: అంగన్‌వాడీ కేంద్రాల భవనాల్లో ఇక విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్నాయి. జిల్లాలోని ఏడు ఐసీడీసీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,840 అంగన్‌వాడీ కేంద్రాల భవనాలున్నాయి. వీటిలో సొంత భవనాలు 888, అద్దె భవనాలు 501, రెంట్ ఫ్రీ భవనాలు 451 ఉన్నాయి. ఇందులో 1,296 భవనాలకు విద్యుత్ సరఫరా ఉండగా మిగిలిన 544 భవనాలకు కరంట్ సరఫరా లేదు. ఇకపై ఈ కేంద్రాలకు కూడా విద్యుత్ సౌకర్యం రానుంది. ఈ మేరకు మీటర్లు జారీ చేయాలని, విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని గత డిసెంబర్‌లో టీజీఎన్‌పీడీసీఎల్ నుంచి జిల్లా విద్యుత్ ఎస్‌ఈ, డీఈలకు ఆదేశాలు అందాయి. అంగన్‌వాడీ భవనాల్లో విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఏటా వేసవిలో చిన్నారులు ఉక్కపోతతో అస్వస్థతకు గురైన ఘటనలు ఉన్నాయి. విద్యుత్ సరఫరాతో ఆ వెతలు తీరనున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా లేక ఏర్పడే ఇబ్బందులను పలువురు డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క దృష్టికి తేగా ఆయన స్పందించి సమస్య పరిష్కారం దిశగా చర్యలు చేపట్టారు.
జీరో బిల్లుతోనే సరఫరా..
రాష్ట్రంలో గృహజ్యోతి పథకం కింద నెలకు 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించేవారికి ప్రభుత్వం ఉచితంగానే సరఫరా చేస్తోంది. అంగన్‌వాడీ భవనాలకు కూడా జీరో బిల్లు(ఉచిత విద్యుత్) వర్తింపజేయనుంది. స్థానిక అంగన్‌వాడీ సిబ్బంది ఎన్‌పీడీసీఎల్‌కు రూ.125 చెల్లిస్తే అధికారులు విద్యుత్ మీటర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక విద్యుత్ సరఫరా ఉన్న కేంద్రాల్లోనూ ఫ్యాన్లు లేవు. చిన్నారులు వేసవి తీవ్రత, ఉక్కపోత తట్టుకునేలా ఐసీడీఎస్ శాఖ అధికారులు ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని చిన్నారుల తల్లిదండ్రులు, బాలింతలు, గర్భిణులు కోరుతున్నారు.
అంగన్‌వాడీల్లో ఇక వెలుగులు
అంగన్‌వాడీల్లో ఇక వెలుగులు


