‘రంజాన్‌’ ఆగయా.. | - | Sakshi
Sakshi News home page

‘రంజాన్‌’ ఆగయా..

Feb 19 2026 9:53 AM | Updated on Feb 19 2026 9:53 AM

‘రంజాన్‌’ ఆగయా..

‘రంజాన్‌’ ఆగయా..

● నేటి నుంచి ముస్లింల ఉపవాస దీక్షలు ● నెలవంక దర్శనంతో ప్రారంభమైన వేడుకలు ● సుందరంగా ముస్తాబైన మసీదులు

నెలవంక దర్శనం..

● నేటి నుంచి ముస్లింల ఉపవాస దీక్షలు ● నెలవంక దర్శనంతో ప్రారంభమైన వేడుకలు ● సుందరంగా ముస్తాబైన మసీదులు

సత్తుపల్లి: ముస్లింలకు ప్రీతిపాత్రమైన రంజాన్‌ మాసం వచ్చేసింది. ఈ నెలలోనే పవిత్ర ఖురాన్‌ అవతరించిందని వారి విశ్వాసం. ముస్లింలు విధిగా రోజా(ఉపవాసం) పాటించడంతో పాటు ఈ నెలంతా ఖురాన్‌ పఠనంలో గడుపుతారు. 30 రోజులు ఉపవాస దీక్షలు ఆచరించిన వారు అల్లాహ్‌ అనుగ్రహం పొందుతారని వారి నమ్మకం. ఈ మాసంలో ఏదైనా పుణ్య కార్యక్రమం చేస్తే 70 రెట్ల పుణ్యఫలం లభిస్తుందని చెబుతారు. రోజా(ఉపవాసం) ఆచరించే సమయంలో చెడు మాట్లాడకుండా, దురాలోచనలు దరి చేరకుండా అల్లాహ్‌ స్మరణలో ఉండాలని, సర్వేంద్రియాలు అదుపులో ఉంచుకోవాలని మత పెద్దలు సూచిస్తున్నారు.

ఉపవాస దీక్షలు ఇలా..

పేద, ధనిక వ్యత్యాసం లేకుండా ముస్లింలంతా ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. సూర్య కిరణాలు పడకముందే అన్నపానీయాలు పూర్తి చేసి, సూర్యాస్తమయ సమయాన ఉపవాస దీక్షలు విరమిస్తారు. కాగా, గురువారం తెల్లవారుజామున 5.12 గంటలకు ఉపవాస దీక్ష ప్రారంభమై సాయంత్రం 6.18 గంటలకు ముగుస్తుంది. ప్రాంతాలను బట్టి కొన్నిచోట్ల ఈ వేళలు 5 నుంచి 7 నిమిషాల వ్యత్యాసంతో ఉంటాయి.

రంజాన్‌ విశిష్టత..

రంజాన్‌ నెలను మూడు భాగాలుగా విభజిస్తారు. మొదటి పదిరోజులు రహమత్‌కే రోజాలు(కరుణ కురిపించే), రెండో పదిరోజులు మగఫిరత్‌కే రోజాలు (పాపాల నుంచి క్షమాపణ పొందే దినాలు), చివరి పది రోజులు జహున్నుమ్‌సే ఝాట్‌కారే రోజాలు(నరకదండన నుంచి విముక్తి కోరే దినాలు)గా పిలుస్తారు. చివరి పదిరోజులు ఇతెఖాఫ్‌(మసీద్‌లో అల్లాహ్‌నామ స్మరణ చేసుకుంటూ గడపటం) పాటిస్తారు.

తరావీహ్‌ నమాజ్‌..

రంజాన్‌ నెలవంక కనిపించగానే ప్రతి రోజు ఇషా నమాజ్‌ తర్వాత ‘తరావీహ్‌’ నమాజ్‌ ఆచరిస్తారు. కేవలం రంజాన్‌ నెలలోనే తరావీహ్‌ నమాజ్‌ చేస్తారు. 20 రకాతులు నమాజ్‌లో ఖురాన్‌ పఠనం ఉంటుంది. రాత్రి 8.30 గంటల నుంచి సుమారు 10 గంటల వరకు తరావీహ్‌ నమాజ్‌ అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు. దీని ద్వారా రోజేదార్‌(ఉపవాస దీక్షాపరుడు) ఖురాన్‌ పఠనం వినడం వల్ల చదివినంత పుణ్యఫలం వస్తుందని ముస్లింల విశ్వాసం.

జకాత్‌, ఫిత్రాహ్‌, సథఖహ్‌..

రంజాన్‌ మాసంలో జకాత్‌, ఫిత్రాహ్‌, సథఖహ్‌ చేస్తారు. ప్రతి ముస్లిం రంజాన్‌ పర్వదినాన్ని జరుపుకోవాలనే ఉద్దేశంతో పేదలకు దానధర్మాలు చేస్తారు. ఈ నెల చివరి వారం రోజుల్లో ఫిత్రా ఇస్తారు. కుటుంబంలో ప్రతి ఒక్కరికీ ఫిత్రాహ్‌ విధిగా నిర్ణయించబడుతుంది. పండుగ రోజు పుట్టిన బిడ్డకు సైతం ఫిత్రాహ్‌ చెల్లించాల్సిందే. ‘ఫిత్రాహ్‌’ విలువను 1.75 కిలోల గోధుమ ధరతో లెక్కిస్తారు. అదే విధంగా జకాత్‌(విధి దానం) చెల్లించాల్సి ఉంటుంది. ఏడున్నర తులాల బంగారం, 52.50 తులాల వెండి కలిగి ఉన్న ప్రతీ ముస్లీం విధిగా జకాత్‌ ఇవ్వాల్సి ఉంటుంది. ‘జకాత్‌’ను పేదలు, అనాథ పిల్లలు ఉండే ముస్లిం మదర్సాలకు ఇస్తారు. సంపాదనలో కొంత సొమ్మును ‘సథఖహ్‌’ కింద బంధువుల్లోని నిరుపేదలకు ఇస్తారు.

లైలతుల్‌ ఖదర్‌ అన్వేషణ..

రంజాన్‌ నెలలోని 21, 23, 25, 27, 29వ రోజుల్లో ముస్లింలు జాగారం చేస్తూ.. నమాజ్‌ ఆచరిస్తూ.. ఖురాన్‌ పఠిస్తూ లైలతుల్‌ ఖదర్‌(తాఖ్‌రాత్‌) అన్వేషిస్తారు. లైలతుల్‌ ఖదర్‌ రోజు రాత్రి జరిగే నమాజ్‌తో వెయ్యి రాత్రుల ఫుణ్యఫలం దక్కుతుందని ముస్లింల విశ్వాసం. దీని కోసం చివరి ఐదురోజులు జాగారం చేస్తూ అల్లాహ్‌ కరుణ పొందేందుకు అన్వేషిస్తారు.

నెలవంక బుధవారం సాయంత్రం కనిపించగా గురువారం తెల్లవారుజాము నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభిస్తారు. రంజాన్‌ మాసాన్ని పుసరస్కరించుకుని మసీదులను విద్యుత్‌ దీపాలు, రంగులతో అలంకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement