కోర్టు ఆదేశాలను గౌరవించాలి..
ఖమ్మం మామిళ్లగూడెం: కోర్టు ఆదేశానుసారమే భూదాన్ భూముల్లో పేదలు ఇళ్లు నిర్మించుకున్నారని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ తెలిపారు. ఈమేరకు అక్కడ నీటి వసతి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలో మంగళవారం ఆయన సీనియర్ జర్నలి స్ట్ పాశం యాదగిరితో కలిసి మాట్లాడారు. ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూమిని 2014లో పేదల ఇళ్లస్థలాల కోసం కేటాయించారని తెలిపారు. అక్కడ వసతుల కల్పనపై కోర్టు ఆదేశాలు ఉన్నా అధికారులు నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. అంతేకాక పేదలను వెళ్లగొట్టే చర్యలకు దిగడం సరికాదన్నారు. అయితే, భూదాన్ భూమిని కబ్జా చేసే ప్రయత్నంలో రాజకీయ నాయకులు ఉన్నట్లు తెలుస్తోందని చెప్పారు. ఇకనైనా జిల్లా అధికారులు కోర్టు ఆదేశాలను అనుసరించి ఇళ్లు నిర్మించుకున్న వారికి సౌకర్యాలు కల్పించాలని కోరారు. అలాకాకుండా పేదలను పంపించాలని చూస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వారు తెలిపారు. అలాగే, ఈ భూములు ఎవరైనా కొనుగోలు చేస్తే ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్ మోహన్‌రెడ్డి, న్యాయవాది లక్ష్మీనారాయణ, డి.విజయేందర్, భద్రునాయక్, యర్ర బాబు తదితరులు పాల్గొన్నారు.


