ఏపీ నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్
ఖమ్మంక్రైం: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్లను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సీజ్ చేసినట్లు పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీ లను సీజ్ చేయడమే కాక యాజమానులు, ఏజెంట్లు, డ్రైవర్లపై కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఏపీ నుంచి సత్తుపల్లి ప్రాంతానికి ఇసుక తరలిస్తున్న టిప్పర్, ట్రాక్టర్‌ను బుధవారం తెల్లవారుజామున సత్తుపల్లి మండలం గంగారం చెక్‌పోస్ట్ వద్ద గుర్తించినట్లు తెలిపారు. అలాగే, కంచికచర్ల మండలం నుంచి ఇసుకతో వస్తున్న రెండు లారీలను తల్లాడ మండలం కుర్నవల్లి వద్ద తల్లాడ పోలీసులు పట్టుకున్నారని పేర్కొన్నారు. అంతేకాక వేంసూరు మండలం వెంకటాపురం గ్రామంలోకి వస్తున్న ఇసుక లారీ, ఏపీలోని మల్కాపురం నుంచి వస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను బాణాపురం వద్ద ముదిగొండ పోలీసులు పట్టుకున్నారని సీపీ వివరించారు. అలాగే, ఇసుక లోడ్‌తో వచ్చిన ట్రాక్టర్లను కల్లూరులో సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు.
భూమి ఆక్రమించుకున్నారని ఆవేదన
కారేపల్లి: జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్లకు ప్రభుత్వం పునరావాసం కింద కేటాయించిన వ్యవసాయ భూమిని కొందరు ఆక్రమించుకోవడమే కాక రికార్డుల్లో పేర్లు మార్పించుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. కారేపల్లిలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి, తుడుందెబ్బ నాయకులతో కలిసి గలిగ పాపమ్మ తదితరులు మంగళవారం మాట్లాడారు. 2003లో లొంగిపోయిన పాపమ్మకు కమలాపురం సర్వే నంబర్ 147లో 4–37ఎకరాల భూమి కేటాయించగా, అప్పటి మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పట్టా అందజేశారు. ఈ భూమిని గిరిజనేతరులు ఆక్రమించుకోగా పోలీసులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైందన్నారు. అయినా ఆగకుండా ఓ గిరిజన రైతు ద్వారా దాడులకు దిగుతున్నారని, మరికొందరి భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులో పేర్లు మార్పించారని వాపోయారు. ఈమేరకు అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని పాపమ్మ తదితరులు కోరారు. ఈ సమావేశంలో నాయకులు అలెం కృష్ణ, కల్తి రాంప్రసాద్, ఈసం భాస్కర్, గలిగ జయమ్మ పాల్గొన్నారు.
ఆభరణాలతో పాటు నగదు చోరీ
చింతకాని: మండలంలోని కోమట్లగూడెంకు చెందిన దుంపల బాబు ఇంట్లో చోరీ జరిగింది. బాబు దంపతులు సోమవారం తల్లాడ మండలం మిట్టపల్లికి వెళ్లి మంగళవారం ఉదయం తిరిగి వచ్చారు. అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి ఉండగా, లోపల పరిశీలిస్తే 13 గ్రాముల బంగారం, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.20 వేల నగదు చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈమేరకు బాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరేందర్ తెలిపారు.
కంది పంటకు నిప్పుపెట్టిన ఇద్దరిపై కేసు
ముదిగొండ: మండలంలోని వల్లాపురంలోని ఓ రైతు కంది పంటకు నిప్పు పెట్టిన ఇరువురిపై మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ అశోక్ తెలిపారు. వల్లాపురానికి చెందిన కొక్కిరేణి వెంకయ్య రెండున్నర ఎకరాల్లో కంది పంట సాగు చేయగా, అదే గ్రామానికి చెందిన మేరే శ్రీనివాస్, మేరే పిచ్చయ్య సోమవారం రాత్రి నిప్పుపెట్టారు. దీంతో పంట పూర్తిగా కాలి బూడిదై రూ.30వేల మేర నష్టం జరిగింది. బాధిత రైతు వెంకయ్య ఫిర్యాదుతో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రూ.5లక్షల విలువైన పాడిగేదెలు చోరీ
ఖమ్మంఅర్బన్: ఖమ్మం కొత్తగూడెంలో పాడి గేదెలు చోరీకి గురైన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. బాధితురాలు చామకూరి సరస్వతి తెలిపిన వివరాలు... ఆమె భర్త మరణానంతరం పాలు అమ్ముతూ జీవనం సాగిస్తోంది. ఈమేరకు తన ఇంటి సమీపంలో ఐదు గేదెలను కట్టివేసింది. సోమవారం ఉదయంకల్లా రూ.5లక్షల విలువైన గేదెలు లేకపోవడం, ఎక్కడ వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఖమ్మం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అవయవదానంతో పలువురి జీవితాల్లో వెలుగులు
మధిర: అవయవదానంతో ఎనిమిది మందికి పునర్జన్మ కల్పించిన కందిమళ్ల విజయకుమార్ చిరస్మరణీయుడని తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాధవరపు నాగేశ్వరరావు తెలిపారు. మధిరకు చెందిన సైదేశ్వరరావు, రాజేశ్వరి దంపతుల కుమారుడు విజయకుమార్ ఇటీవల ఏపీలోని తాడేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆపై ఆయన బ్రెయిన్‌డెడ్ కాగా విజయకుమార్ అవయవాలను అవసరమైన ఎనిమిది మందికి అమర్చారు. ఈమేరకు అవయవదానానికి అంగీకరించిన విజయ్ తల్లిదండ్రులను మంగళవారం నాగేశ్వరరావు సన్మానించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రమావత్ బాబురావు, ఊట్ల శంకర్‌రావు, శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలు సీజ్


