కొత్త కొలువులు!
వైరాలో కోలాహలం
మధిర పీఠం దక్కింది..
ఏదులాపురంలో 28 మంది బలంతో..
తొలుత కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారం
ఆతర్వాత చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక
ఇల్లెందులో నేటికి వాయిదా పడిన ప్రక్రియ
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: మున్సిపాలిటీల్లో రాజకీయ పరంగా కొత్త కొలువులు భర్తీ అయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక సోమవారం సాఫీగా ముగిసింది. మెజార్టీ కౌన్సిలర్ల బలంతో ఆరు మున్సిపాలిటీలనూ కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. ఇల్లెందు మున్సిపాలిటీలో మాత్రం చైర్మన్ అభ్యర్థి విషయంలో ‘పీఠ’ముడి వీడకపోవడంతో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక మంగళవారానికి వాయిదా పడింది. మిగిలిన చోట్ల టీపీసీసీ నుంచి సీల్డ్ కవర్‌లో వచ్చిన పేర్లను క్యాంపుల్లో ఉన్న సభ్యులకు ముందే చెప్పడంతో సమావేశంలో వారి పేర్లను ప్రతిపాదించాక ఏకగ్రీవంగా ఆమోదించారు. చైర్మన్ ఎన్నికకు సరిపడా బలం ఉన్నా ఎక్స్ అఫీషియో సభ్యుల హోదాలో మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, వైరా, సత్తుపల్లిలో ఎమ్మెల్యేలు రాందాస్‌నాయక్, మట్టా రాగమయి హాజరయ్యారు.
కల్లూరు కై వసం
కల్లూరు మున్సిపాలిటీ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వ్ అయింది. ఇక్కడ 7వ వార్డు నుంచి గెలిచిన ధరావత్ మోహన్ చైర్మన్‌గా ఎన్నికవగా.. 5వ వార్డు కౌన్సిలర్ శీలం కోటీశ్వరి వైస్ చైర్మన్ అయ్యారు. ఈ మున్సిపాలిటీలో మొత్తం 20 వార్డులకు కాంగ్రెస్ పార్టీ 12, బీఆర్‌ఎస్ ఏడింటిని కై వసం చేసుకుంది. మరో వార్డులో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు. బీఆర్‌ఎస్ సభ్యులు కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేసి చైర్మన్ ఎన్నిక సమయాన బయటకు వెళ్లారు.
దంపతులు ‘పేట’
పాలనాధీశులు..
అశ్వారావుపేట మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడింది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో 22 వార్డులకు కాంగ్రెస్ 17, బీఆర్‌ఎస్, స్వతంత్రులు రెండు చొప్పున, బీజేపీ ఒక వార్డులో గెలిచింది. మెజార్టీ కౌన్సిలర్ల బలంతో కాంగ్రెస్ చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను సొంతం చేసుకుంది. ఆరో వార్డు నుంచి విజయం సాధించిన జూపల్లి శశికళ చైర్మన్‌గా, 13వ వార్డు నుంచి గెలిచిన జూపల్లి రమేశ్‌బాబు వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరిద్దరూ దంపతులు కావడం విశేషం.
సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ రేసులో ఇద్దరు, ముగ్గురు ఆశావహులు ఉన్నా 22వ వార్డు నుంచి గెలిచిన ఎండీ.రెహనాబేగంకు అవకాశం దక్కింది. జనరల్ మహిళకు ఈ పదవి రిజర్వ్ అయింది. వైస్ చైర్మన్‌గా మూడో వార్డు కౌన్సిలర్ బొంతు సుమలత ఎన్నికయ్యారు. తొలుత కాంగ్రెస్ నుంచి 17 మంది, బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఆరుగురు ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ ఎన్నిక సమయాన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు వెళ్లిపోయారు. ఎమ్మెల్యే మట్టా రాగమయి ఎక్స్‌అఫీషియో హోదాలో ఓటు వినియోగించుకున్నారు.
ఇల్లెందు మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. మొత్తం 24 మందికి గాను బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ముగ్గురు ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ సభ్యులు 21 (ఇండిపెండెంట్లు ఇద్దరితో కలిపి) మంది హైదరాబాద్‌లోని క్యాంపు నుంచి బయలుదేరి ఇల్లెందుకు వచ్చే సరికి సమావేశ సమయం ముగిసింది. దీంతో ప్రమాణ స్వీకారం మంగళవారం నిర్వహించనున్నట్లు ఆర్డీఓ మధు వెల్లడించారు. ఇక్కడ చైర్‌పర్సన్ పదవి బీసీ మహిళకు రిజర్వ్ అయింది. పదవికి ముగ్గురు పోటీ పడుతుండడంతో, ఎవరన్నది తేలక సమావేశానికి హాజరు కాలేదని సమాచారం.
వైరా మున్సిపల్ చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో ఆరో వార్డు నుంచి గెలిచిన డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్‌గా 9వ వార్డుకు చెందిన కట్ల సంతోష్ ఎన్నికయ్యారు. కాంగ్రెస్ నుంచి 12మంది, ఇండిపెండెంట్ ఒకరు వీరికి ఓటు వేశారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఐదుగురు, సీపీఎం, సీపీఐ నుంచి గెలిచిన ఒక్కొక్కరు కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. చైర్మన్ ఎన్నిక ముగిసే వరకూ సమావేశంలోనే ఉన్నారు.
నగర పంచాయతీగా ఉన్న మధిర 2020లో మున్సిపాలిటీగా ఏర్పడింది. మున్సిపాలిటీ అయ్యాక తొలిసారి బీఆర్‌ఎస్ పుర పీఠం దక్కించుకుంది. ఇప్పుడు మెజార్టీ వార్డుల్లో కాంగ్రెస్ గెలుపొందగా చైర్మన్, వైస్ చైర్మన్ పీఠాలను కై వసం చేసుకుంది. మొత్తం 22 వార్డులకు గాను 21వార్డుల్లో కాంగ్రెస్ కూటమి గెలిచింది. మరో వార్డు బీఆర్‌ఎస్‌కు దక్కింది. చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో 4వ వార్డు నుంచి విజయం సాధించిన సామినేని సుజాత చైర్మన్‌గా, 18వ వార్డు నుంచి గెలిచిన కోనా ధనికుమార్ వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఎక్స్ ఆఫీషియో హోదాలో హాజరయ్యారు.
ఆరు మున్సిపాలిటీలపై ‘హస్తం’ పీఠాధిపతులు
ఏదులాపురం మున్సిపాలిటీలో 32 వార్డులకు గాను కాంగ్రెస్ నుంచి 24 మంది కౌన్సిలర్లు గెలవగా, సీపీఐ నుంచి ముగ్గురు, మరో ఇండిపెండెంట్ కౌన్సిలర్ సైతం చైర్మన్, వైస్ చైర్మన్‌కు మద్దతు తెలిపారు. దీంతో 28 మంది మద్దతు చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ అభ్యర్థులకు దక్కింది. చైర్‌పర్సన్ పదవి ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా 23వ వార్డు నుంచి గెలిచిన పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్‌గా 14వ వార్డుకు చెందిన తమ్మినేని నవీన్‌ను ఎన్నుకున్నారు. కాగా, సీపీఎం నుంచి గెలిచిన ఇద్దరు, బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఇద్దరు కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశాక బయటకు వెళ్లిపోయారు.


