మేయర్‌ పీఠంపై సీపీఐ | - | Sakshi
Sakshi News home page

మేయర్‌ పీఠంపై సీపీఐ

Feb 17 2026 7:27 AM | Updated on Feb 17 2026 7:27 AM

మేయర్‌ పీఠంపై సీపీఐ

మేయర్‌ పీఠంపై సీపీఐ

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షించిన కొత్తగూడెం కార్పొరేషన్‌లో సీపీఐ – కాంగ్రెస్‌ మిత్రపక్షాలకు చెందిన మొదటి పాలవర్గం కొలువుదీరింది. దీంతో మూడు రోజుల ఉత్కంఠకు తెర పడింది. కార్పొరేషన్‌ ఎన్నికల్లో 22 డివిజన్లలో గెలిచి అతి పెద్ద పార్టీలుగా అవతరించిన సీపీఐ, కాంగ్రెస్‌ చెరి రెండున్నరేళ్లు అధికారాన్ని పంచుకోవాలని నిర్ణయించాయి. ఆ మేరకు సీపీఐ తరఫున 20వ డివిజన్‌ నుంచి గెలుపొందిన మూడ్‌ గణేశ్‌ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ మేయర్‌ పదవి కాంగ్రెస్‌ తరఫున 8వ డివిజన్‌ నుంచి గెలుపొందిన సిరిపురం లలితకుమారికి దక్కింది. సీపీఐ, కాంగ్రెస్‌, సీపీ ఎం, బీజేపీతో పాటు స్వతంత్రులుగా గెలిచిన కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారానికి హాజరు కాగా, బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ఎనిమిది మంది కొత్తగూడెంలోనే ఉన్నప్పటికీ గైర్హాజరయ్యారు. ఆ పార్టీకి చెందిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావులతో కలిసి జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లికి వందనం చేశారు. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఆ పార్టీ తరఫున ప్రకటన విడుదల చేశారు.

సాఫీగా సాగిపోయింది

తెలంగాణలో తొలిసారిగా క్యమూనిస్టు పార్టీ నేతృత్వాన కార్పొరేషన్‌లో పాలకవర్గం ఏర్పాటైంది. అంతకు మూడు రోజుల ముందు దీనిపై రాష్ట్ర స్థాయిలో హైడ్రామా చోటుచేసుకుంది. కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత అధిష్టానం జోక్యం చేసుకోవడంతో సీపీఐ – కాంగ్రెస్‌ పార్టీల నుంచి ‘పవర్‌ షేరింగ్‌’ ప్రకటన వచ్చింది. అయితే, అందుకు తగ్గట్టుగా క్షేత్రస్థాయిలో ఈ రెండు పార్టీల నుంచి సంయుక్త ప్రకటన, సమావేశాల వంటివి జరగలేదు. పైగా ఎవరికి వారే అన్నట్టుగా తమ శిబిరాలను కొనసాగించారు. దీంతో ప్రమాణ స్వీకారం రోజున ఏం జరుగుతుందోననే ఆసక్తి నెలకొంది. అయితే, నాటకీయ పరిణామాలకు ఇరు పక్షాలు తావివ్వలేదు. పవర్‌ షేరింగ్‌ ఒప్పందంలో కీలక భూమిక పోషించిన సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కొత్తగూడెం చేరుకున్నారు. వీరితో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా, డీసీసీ అధ్యక్షురాలు తోటి దేవీప్రసన్న కలిసి సీపీఐ, కాంగ్రెస్‌కు చెందిన కార్పొరేటర్లతో ఉదయం 11–30 గంటలకు కార్పొరేషన్‌ కార్యాలయానికి చేరుకున్నారు. ఆ వెనుకే మరికొందరు కార్పొరేటర్లతో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా వచ్చారు. అప్పటికే ఇరు పక్షాలు చర్చించుకోవడంతో మేయర్‌ పదవి సుజాతనగర్‌ ప్రాంతానికి దక్కగా, డిప్యూటీ మేయర్‌ పాల్వంచకు వెళ్లింది. అంతకుముందు సీపీఐతో పవర్‌ షేరింగ్‌ చేసుకోవడాన్ని ఆక్షేపిస్తూ కాంగ్రెస్‌ తరఫున 26వ డివిజన్‌ నుంచి గెలిచిన దుంపల రాజేశ్వరరావు నల్ల బ్యాడ్జీ ధరించి నిరసన తెలిపారు. పాలకవర్గంతో తనకు సంబంధం లేదని, తాను ప్రతిపక్ష పాత్ర తీసుకుంటానని ఆయన ప్రకటించారు.

కూనంనేని అభినందనలు..

కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన మూడ్‌ గణేశ్‌ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అభినందిచారు. ఆయనతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్‌పాషా తదితరులు గణేశ్‌ను మేయర్‌ సీటులో కూర్చోబెట్టారు.

కొత్తగూడెంలో సాఫీగా సాగిన

‘మిత్రపక్షం’ప్రమాణ స్వీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement