దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

Feb 17 2026 7:27 AM | Updated on Feb 17 2026 7:27 AM

దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

ఖమ్మం సహకారనగర్‌: ప్రజావాణి(గ్రీవెన్స్‌ డే)లో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులు, వినతిపత్రాలను ఎప్పటికప్పుడు పరిష్కరించి పరిష్కరించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన ప్రజావాణిలో ఆయన అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజతో కలిసి అర్జీలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై పరిష్కారంపై సూచనలు చేశారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

రఘునాథపాలెం మండలం మంచుకొండ, కోయచిలక రైతులకు మంచుకొండ, కోయచిలక రెవెన్యూ పరిధిలో భూములు ఉండగా, వెళ్లేందుకు కొందరు అడ్డుపడుతున్నందున న్యాయం చేయాలని కోరారు. కొణిజర్లకు చెందిన సయ్యద్‌ లాల్‌ బీ తన భూమి అసైన్డ్‌ జాబితాలో చేరినందున పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అభివృద్ధి పనులకు మంజూరైన రూ.28లక్షల నిధుల వ్యయంలో అక్రమాలు జరుగుతున్నాయని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గోకినపల్లి మస్తాన్‌, నాయకులు శ్రీకాంత్‌, రాము ఫిర్యాదు చేశారు.

దివ్యాంగులు రాణించాలి

ఖమ్మం సహకారనగర్‌: దివ్యాంగ విద్యార్థులు పట్టుదలతో ముందు సాగుతూ ఇతర రంగాలతో పాటు క్రీడల్లోనూ రాణించాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. దివ్యాంగ విద్యార్థుల రాష్ట్రస్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి వెళ్తున్న వారి బస్సును కలెక్టర్‌ ప్రారంభించి మాట్లాడారు. దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపేలా పోటీలు దోహదపడతాయన్నారు. హైదరాబాద్‌లో మంగళవారం జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా నుంచి అండర్‌–14, 16 విభాగాల్లో 20 మంది పాల్గొంటున్నారని తెలిపారు.

గ్రీవెన్స్‌ డేలో కలెక్టర్‌ అనుదీప్‌

ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతుల కల్పన

జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో కావాల్సిన వసతులు కల్పించి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్‌ అనుదీప్‌ సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ అంశాలపై సమీక్షించిన ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు మరింత మెరుగుపరచాల్సిన అవసరముందన్నారు. అలాగే, గ్రామపంచాయతీ, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం ఈజీఎస్‌ ద్వారా చేపట్టేలా ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. కాగా, వేసవిలో తాగునీటి ఎద్దడి ఎదురుకాకుండా ముందస్తు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు. ఆతర్వాత రబీ ధాన్యం కొనుగోళ్లు, ప్రమాదాల నివారణకు బ్లాక్‌స్పాట్ల వద్ద చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఈసమావేశాల్లో జెడ్పీ సీఈఓ దీక్షా రైనా, ఇన్‌చార్జ్‌ డీఈఓ శ్రీనివాసరావు, ఏఎస్‌ఓ భానుప్రకాష్‌, డీఎస్‌ఓ శ్రీనివాస్‌, సీఎంఓ బి.ప్రవీణ్‌కుమార్‌, వివిధ శాఖల అధికారులు యాకూబ్‌, రామారావు, రాజశేఖర్‌, చందునాయక్‌, శ్రీలత, రాంబాబు, పుష్పలత, వాణిశ్రీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement