బాల్య వివాహ రహిత జిల్లాయే లక్ష్యం
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం జిల్లాను 2030 నాటికి బాల్య వివాహ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని, ఇందుకు పోలీసు శాఖ పూర్తి సహకారం అందిస్తుందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లా అండ్ ఆర్డర్) ప్రసాదరావు అన్నారు. ఆదివారం జిల్లాలో బాల్య వివాహ ముక్త్ భారత్ రథయాత్రను నగరంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. పేదరికం, మూఢనమ్మకాలతో పోరాడి బాల్య వివాహాలను అంతం చేయాలని, చదువు ద్వారానే విద్యార్థులు జీవితంలో స్థిరపడాలని పిలుపునిచ్చారు. ఎయిడ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్‌పర్సన్ భారతరాణి, సంస్థ డైరెక్టర్ హరి ప్రసాదరావు తదితరులు పాల్గొని అవగాహన కల్పించారు.
రిటైర్మెంట్ బెనిఫిట్‌లు
వెంటనే చెల్లించాలి
ఖమ్మంఅర్బన్: రిటైర్మెంట్ బెనిఫిట్‌లు వెంటనే చెల్లించాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఖమ్మం జయనగర్ కాలనీలో గుండెపోటుతో మృతి చెందిన రిటైర్డ్ హెచ్‌ఎం గౌస్ మృతదేహానికి ఆదివారం నివాళులర్పించాక ఆయన మాట్లాడారు. గౌస్ 2025 ఆగస్టులో ఉద్యోగ విరమణ పొందినా ఇప్పటివరకు రిటైర్మెంట్ బెనిఫిట్‌లు అందలేదని, అనారోగ్యంతో ఉన్నా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ మెరుగైన వైద్యం చేయించుకునే పరిస్థితి లేకపోవడంతో మృతి చెందాడని తెలిపారు. రిటైర్డ్ ఉపాధ్యాయులు, ఉద్యోగులు ప్రశాంత జీవనం గడపడానికి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
శిథిలావస్థలో హాస్టల్ వసతి..
బోనకల్: మండలంలోని జానికీపురం ఎస్సీ హాస్టల్‌లో సరైన వసతులు లేక విద్యార్థులు అవస్థలు పడుతుండడంతో ఆదివారం పీడీఎస్‌యూ ఆధ్వర్యాన హాస్టల్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నాక పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు గోకెనపల్లి మస్తాన్ మాట్లాడారు. శిథిలావస్థకు చేరిన హాస్టల్‌లో 35 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, మరుగుదొడ్లు సరిపడా లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన భవనాన్ని నిర్మించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట జిల్లా కమిటీ సభ్యులు నాగార్జున, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి తీవ్ర గాయాలు
టేకులపల్లి: గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న క్షతగాత్రులను అటు వైపు వచ్చిన ఇల్లెందు డీఎస్పీ స్పందించి ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం బాబు క్యాంపునకు చెందిన ఉప్పలి ప్రసాద్, ఇల్లెందుకు చెందిన జాగంటి విల్సన అనే ఇద్దరు వ్యక్తులు బైక్‌పై ఆదివారం రాత్రి కొత్తగూడెం నుంచి ఇల్లెందుకు బయలుదేరారు. ఈక్రమంలో రోళ్లపాడు క్రాస్‌రోడ్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంలో వారిద్దకీ తీవ్ర గాయాలై రోడ్డుపై పడ్డారు. కొంతసమయం తర్వాత టేకులపల్లి మండలంలో శివరాత్రి వేడుకల పర్యవేక్షణ ముగించుకుని ఇల్లెందుకు బయలుదేరిన ఇల్లెందు డీఎస్పీ వెంకన్న బాబు వారిని చూసి వెంటనే 108 ద్వారా ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ప్రసాద్‌కు కాలు, చెయి విరిగి తలకు గాయాలు కాగా, విల్సన్‌కు కూడా కాలు, చేతులు విరగడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంకు తరలించారు.
మణుగూరు టౌన్: మండలంలోని ఉడతనేనిగుంపు శివారు ప్రాంతంలో మోటార్‌సైకిల్ అదుపుతప్పి చెట్టుకు ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి అదే గ్రామానికి చెందిన ఇర్ప సుధీర్(21) తన వ్యక్తిగత పనిమీద పట్టణానికి వచ్చి తిరిగి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ఉడతనేనిగుంపు వద్ద ఉన్న ఓ చెట్టు వేగంగా ఢీకొనడంతో తలకు తీవ్ర గాయమై సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు.
బాల్య వివాహ రహిత జిల్లాయే లక్ష్యం
బాల్య వివాహ రహిత జిల్లాయే లక్ష్యం
బాల్య వివాహ రహిత జిల్లాయే లక్ష్యం


