ప్రమాదమా..? పథకం ప్రకారమా? | - | Sakshi
Sakshi News home page

ప్రమాదమా..? పథకం ప్రకారమా?

Feb 16 2026 7:35 AM | Updated on Feb 16 2026 7:35 AM

ప్రమాదమా..? పథకం ప్రకారమా?

ప్రమాదమా..? పథకం ప్రకారమా?

● మోతె వద్ద రక్తపు మడుగులో యువకుడు ● స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలింపు ● విషమంగా యువకుడి ఆరోగ్య పరిస్థితి

● మోతె వద్ద రక్తపు మడుగులో యువకుడు ● స్థానికులు గమనించి ఆస్పత్రికి తరలింపు ● విషమంగా యువకుడి ఆరోగ్య పరిస్థితి

బూర్గంపాడు: మోతె పట్టీనగర్‌ గ్రామ సమీపంలోని ఎదుర్లవాగు బ్రిడ్జి వద్ద శనివారం ఓ యువకుడు రక్తపు మడుగులో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు క్షతగాత్రుడిని భద్రాచలానికి తరలించారు. క్షతగాత్రుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఎటపాక మండలం గన్నవరం గ్రామానికి చెందిన కట్టా యశ్వంత్‌గా గుర్తించారు. అతని తలకు తీవ్రగాయాలు కావడంతో అతడి బంధువులు గుంటూరుకు, అక్కడి నుంచి ఖమ్మానికి తరలించారు.

సోషల్‌ మీడియాలో వార్తలు..

గన్నవరం గ్రామానికి చెందిన యశ్వంత్‌ కొంతకాలం సారపాకలోని ఐటీసీ పీఎస్‌పీడీలో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేశాడు. ప్రస్తుతం అతను ఐటీసీలో పని మానేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. శనివారం సాయంత్రం యశ్వంత్‌ అశ్వాపురం మండలం వచ్చినట్లుగా తెలుస్తోంది. అదే రోజు రాత్రి అశ్వాపురం మండలంలో ఓ యువకుడిపై దాడి జరిగినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు రాగా.. ఇది మోతె పట్టీనగర్‌ బ్రిడ్జి వద్ద ఘటనను నిర్థారణ చేస్తోంది. యశ్వంత్‌ అంటే గిట్టనివారు దాడి చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని చర్చసాగుతుంది. అయితే యశ్వంత్‌ పడిఉన్న దగ్గర నుంచి కొద్దిదూరంలో అతను వేసుకొచ్చిన స్కూటీ బాగానే ఉండగా.. ఏమైనా వాహనాలు ఢీకొట్టినట్లు ఆనవాళ్లు ఏమీ కనపడకపోవడం గమనార్హం.

దాడిపై పలు అనుమానాలు..

యశ్వంత్‌ తన తల్లిదండ్రులు మృతిచెందడంతో మేనమామ వద్ద ఉంటున్నాడు. ఈక్రమంలో జాబ్‌ మానేసిన అతడు శనివారం రాత్రి అలా రక్తపు మడుగులో పడి ఉండడంపై ప్రేమికుల రోజున అతనిని నమ్మించి ఇక్కడకు రప్పించి పథకం ప్రకారమే దాడి చేశారా అని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ దాడికి ప్రేమ వ్యవహారం కాని, వివాహేతర సంబంధం కాని కారణమని స్థానికంగా చర్చ సాగుతుంది. ఈ విషయమై బూర్గంపాడు ఎస్‌ఐ మేడ ప్రసాద్‌ను వివరణ కోరగా.. శనివారం రాత్రి మోతె పట్టీనగర్‌ వద్ద ప్రమాదం జరిగిందని తమకు సమాచారం వచ్చిందని, దీంతో రోడ్డు ప్రమాదం జరిగిందనే అనుమానంతో అటుగా వస్తున్న వాహనాలను తనిఖీ కూడా చేశామన్నారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, బాధితుని తరఫున ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement