జాతీయ ఉద్యోగుల క్రీడాపోటీలకు వినయ్
ఖమ్మంస్పోర్ట్స్: తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడల్లో భాగంగా జిల్లాకు చెందిన ఆర్.వినయ్‌వర్షిత్ బాస్కెట్‌బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. దీంతో ఈ నెల 17 నుంచి న్యూఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టులో ఆయనకు స్థానం దక్కింది. కాగా, వినయ్ ప్రస్తుతం కూసుమంచి మండలం నేలపట్ల జెడ్పీహెచ్‌ఎస్‌లో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తుండగా ఎంపీడీఓ జశ్వంత్‌కుమార్, హెచ్‌ఎం రామాచారి, పీవీ రమణ, ఉపాధ్యాయులు అభినందించారు.
ముదిగొండ ఈఆర్వో కార్యాలయం మంజూరు
ఖమ్మంవ్యవసాయం: ఇటీవల ఏర్పాటైన మధిర విద్యుత్ డివిజన్ పరిధిలో నూతనంగా ముదిగొండ విద్యుత్ రెవెన్యూ కార్యాలయాన్ని (ఈఆర్వో) మంజూరు చేశారు. దీనిని తాత్కాలికంగా ఖమ్మం త్రీటౌన్ గుట్టలబజార్‌లోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. కార్యాలయ పరిధిలో ముదిగొండ, పమ్మి, నాగులవంచ, చింతకాని సెక్షన్లు చేర్చగా ఏఏఓగా బండి మాధురి బాధ్యతలు స్వీకరించారు. ముదిగొండలో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేసే వరకు ఖమ్మంలోనే ఈ కార్యాలయం కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
రేక్‌పాయింట్‌కు 2,638 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లిలోని రేక్ పాయింట్‌కు సీఐఎల్ కంపెనీకి చెందిన 2,638.62 మెట్రిక్ టన్నుల యూరియా శనివారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 1,538.62 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 300 మె.టన్నులు, మహబూబాబాద్ జిల్లాకు 600 మెట్రిక్ టన్నులు కేటాయించినట్లు ఏఓ(టెక్నికల్) పవన్‌కుమార్ తెలిపారు. మిగతా 200 మెట్రిక్ క్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.
జమలాపురం హుండీలో నగదు చోరీ
● తాత్కాలిక ఉద్యోగిపై ఈఓ ఫిర్యాదు
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో తాత్కాలిక ఉద్యోగి ఒకరు శుక్రవారం హుండీలోని నగదు చోరీ చేశారు. ఈ మేరకు ఉద్యోగి బి.విజయ్ హుండీలో నగదు చోరీ చేసినట్లు సీసీ కెమెరాల పుటేజీతో గుర్తించినట్లు ఈఓ కె.జగన్మోహన్‌రావు తెలిపారు. ఆయనను ఉద్యోగం నుంచి తొలగించడమే కాక శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దర్యాప్తు మొదలుపెట్టగా, ఎంత నగదు చోరీ చేశాడనేది త్వరలో వెల్లడిస్తామని ఎస్‌ఐ రమేశ్‌కుమార్ తెలిపారు.


