● మృత్యుంజయ స్వామి ఆలయం
మధిర: మధిరలోని వైరా నది ఒడ్డున శ్రీమృత్యుంజయ స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ గర్భగుడిలోకి భక్తులు నేరుగా వెళ్లి అభిషేకం చేసుకునే అవకాశం ఉండడం విశేషం. పంచముఖ ద్వారాలతో కాశీలో మాదిరిగా పడమర దిక్కున వైరా నది, ఉత్తరం దిక్కున శ్మశానం ఉండి చిన్న కాశీగా ఈ క్షేత్రం పేరు పొందింది. తమిళనాడు రాష్ట్రంలోని మధురై పుణ్యక్షేత్రంలో శివలింగాన్ని ప్రతిష్ఠించేందుకు కాశీ నుంచి రైలులో తీసుకెళ్తుండగా ఆ రైలు మధురైకి బదులు మధిరకు చేరిందని చెబుతారు. ఈ విషయం తెలిసిన భక్తులు రైల్వేస్టేషన్‌లో పూజలు చేశాక ఇక్కడ ప్రతిష్ఠించారు. శ్రీ మత్యుంజయ స్వామి దేవాలయం పేరుతో 1965 మార్చి 1న ప్రతిష్ఠించగా నిత్యపూజలు జరుగుతున్నాయి. ఆలయ గర్భగుడికి నాలుగు ద్వారాలు ఏర్పాటు చేయడంతో భక్తులు స్వయంగా అభిషేకం చేసే అవకాశం లభిస్తుంది. అలాగే, గర్భాలయంలోనే శివలింగానికి నైరుతి మూలలో శ్రీ గురుదత్త స్వామి విగ్రహం ఉంటుంది. కాగా, రజాకార్ల తూటాలకు బలైన వానరానికి దేవాలయం పక్కనే ఆలయం నిర్మించి నిత్యం పూజలు చేయడం మరో విశిష్టత. కాగా, ఏటా మహాశివరాత్రికి ఐదు రోజుల పాటు జాతర నిర్వహించనుండగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.
● మృత్యుంజయ స్వామి ఆలయం


