కోడిపందేల స్థావరంపై దాడి
ఎర్రుపాలెం: మండలంలోని జమలాపురం సమీపాన మామిడితోటలో కోడిపందేల స్థావరంపై శుక్రవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. వైరా ఏసీపీ సారంగపాణి శనివారం వివరాలు వెల్లడించారు. గ్రామ సమీప తోటలో ఏపీ, తెలంగాణలోని మైలవరం, జి.కొండూరు, ఎర్రుపాలెం మండలాలకు చెందిన పలువురు కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందగా ఎస్‌ఐ రమేశ్‌కుమార్ సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా 20 మందిని అదుపులోకి తీసుకోగా, వారి నుంచి రూ.43,300 నగదు, తొమ్మిది కార్లు, 23 బైక్‌లు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. కాగా, జూదరులకు ఏసీపీ కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే, అనుమతి లేకుండా ఇసుక, గ్రావెల్ తవ్వకాలు, తరలింపు చేపడితే ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. సమావేశంలో మధిర రూరల్ సీఐ డి.మధు, మధిర, బోనకల్ మండలాల ఎస్‌ఐలు పాల్గొన్నారు.
20 మందిపై కేసు,
రూ.43,300 నగదు స్వాధీనం


