పెద్దాస్పత్రిలో క్లిష్టమైన శస్త్రచికిత్స
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ఆర్థోపెడిక్ వైద్యులు క్లిష్టమైన శస్త్రచికిత్స నిర్వహించి భేష్ అనిపించుకున్నారు. రఘునాథపాలెంనకు చెందిన బి.తరుణ్ (25)కు ఇటీవల జరిగిన ప్రమాదంలో తొంటి ఎముక, కుడికాలి ఎముక విరిగింది. ప్రమాదకర స్థితిలో ఉన్న ఆయనను పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తీసుకెళ్లినా శస్త్రచికిత్స నిర్వహించేందుకు వైద్యులు ముందుకు రాలేదు. ఆయన 120 కేజీల బరువు ఉండడంతో ఇబ్బందులు వస్తాయని వారు నిరాకరించారు. దీంతో కుటుంబీకులు ఈ నెల 9వ తేదీన తరుణ్‌ను పెద్దాస్పత్రి ఆర్థోపెడిక్ విభాగానికి తీసుకొచ్చారు. దీంతో హెచ్‌ఓడీ ఎల్.కిరణ్‌కుమార్ ఆధ్వర్యాన మంగళవారం ఐదు గంటలకు పైగా శ్రమించి చేసిన శస్త్రచికిత్స విజయమైంది. ఈ బృందంలో వివిధ విభాగాల వైద్యులు వినయ్‌కుమార్, మసాస్, రష్మీ, రవి, నాగేందర్ పాల్గొనగా మెడికల్ సూపరింటెండెంట్ ఎం.నరేందర్, డిప్యూటీ సూపరింటెండెంట్ బి.కిరణ్‌కుమార్ అభినందించారు.


