గెలుపు.. మాదే | - | Sakshi
Sakshi News home page

గెలుపు.. మాదే

Feb 13 2026 3:44 AM | Updated on Feb 13 2026 3:44 AM

గెలుప

గెలుపు.. మాదే

● మున్సి‘పోల్స్‌’పై రాజకీయ పార్టీల్లో ధీమా ● ఐదు చోట్ల చైర్‌పర్సన్‌ పీఠంపైనే అందరి గురి ● విజేతలను క్యాంపునకు తరలించేలా ఏర్పాట్లు

బెట్టింగ్‌ల జోరు

● మున్సి‘పోల్స్‌’పై రాజకీయ పార్టీల్లో ధీమా ● ఐదు చోట్ల చైర్‌పర్సన్‌ పీఠంపైనే అందరి గురి ● విజేతలను క్యాంపునకు తరలించేలా ఏర్పాట్లు

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ ముగియగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా తామే గట్టెక్కుతామనే అంచనాకు వస్తూ శుక్రవారం ఓట్ల లెక్కింపు తర్వాత అమలుచేయాల్సిన వ్యూహాలపై చర్చల్లో నిమగ్నమయ్యారు. ఐదు చోట్ల చైర్‌పర్సన్‌ పీఠాన్ని దక్కించుకోవడమే లక్ష్యంగా.. గెలిచిన వారెవరూ జారిపోకుండా క్యాంపులకు తరలించడంతో పాటు విప్‌ జారీకి సిద్ధమవుతున్నారు.

అన్ని పార్టీల్లోనూ అదే ధీమా

మున్సిపాలిటీల్లో పోలింగ్‌ ముగిశాక ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పోస్టుమార్టమ్‌ నిర్వహించారు. ఏ వార్డులో ఎన్ని ఓట్లు పోలయ్యాయి.. పోలింగ్‌ శాతం ఎక్కువగా ఉన్న చోట పరిస్థితి ఎలా ఉంటుంది.. తాము బలంగా ఉన్న ప్రాంతాల్లో ఓట్లు ఎన్ని నమోదై ఉంటాయనే అంశంపై అనుచరులు, కార్యకర్తలు, ఏజెంట్లతో అభ్యర్థులు, నేతలు చర్చించారు. అన్ని మున్సిపాలిటీల్లో ప్రధానంగా కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్యే పోటీ నెలకొనగా.. రెండు పార్టీల అభ్యర్థులు విజయంపై నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు పార్టీలతోపాటు బీజేపీ, సీపీఎం, సీపీఐ కూడా తాము బరిలో ఉన్న వార్డుల్లో గెలుస్తామని ధీమాగా ఉన్నారు.

పీఠంపై గురి

మెజార్టీ మున్సిపాలిటీల్లో చైర్‌పర్సన్‌ పీఠాన్ని కై వసం చేసుకుంటామనే అంచనాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఉన్నాయి. ఈ నేపథ్యాన ఫలితాలు వెలువడ్డాక కౌన్సిలర్లు జారిపోకుండా ఏం చేయాలి.. ఒకటి, రెండు సీట్లు తక్కువైతే ఏ వ్యూహం అమలుచేయాలనే అంశంపై ఇరు పార్టీల్లోనూ మంతనాలు జరుగుతున్నాయి. ఫలితాలు రాగానే అభ్యర్థులు ఎక్కడకు వెళ్లకుండా కట్టడి చేయాలని... పొత్తులో భాగంగా కలిసి పోటీ చేసిన పార్టీల అభ్యర్థులు సైతం ప్రత్యర్థులతో చేతులు కలపకుండా చూడాలనే నిర్ణయానికి వచ్చారు.

నేరుగా క్యాంపులకే...

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఫలితాలు వెలువడిన వెంటనే క్యాంపు మొదలుపెట్టేలా పార్టీల నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గెలిచిన అభ్యర్థులు ఇతర పార్టీలతో బేరసారాలకు దిగకుండా ముందుజాగ్రత్తల్లో భాగంగా తీసుకెళ్లాల్సిన ప్రాంతాలను కూడా ఎంపిక చేసినట్లు సమాచారం. అయితే, ఎన్నికల ఫలితాల ఆధారంగా క్యాంపులు నిర్వహిస్తారా, లేదా అన్నది తేలనుంది. కాగా, ఫలితం వెలువడ్డాక చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నికకు మధ్యలో రెండు రోజుల సమయమే ఉన్నందున దూరం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లోనే క్యాంపు నిర్వహించే అవకాశం ఉండగా.. ఎన్నికకు ముందు పార్టీలు విప్‌ జారీ చేయాలని నిర్ణయించాయి.

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నేపథ్యాన జిల్లాలో జోరుగా బెట్టింగ్‌లు సాగుతున్నాయి. ఐదు మున్సిపాలిటీల్లో గెలుపోటములపై బెట్టింగ్‌ జరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పోలింగ్‌ ముగిసినప్పటి నుంచే అంచనాల ఆధారంగా పార్టీల అభిమానులతోపాటు సామాన్యులు కూడా ఫలానా అభ్యర్థి గెలుస్తారని, ఫలానా పార్టీకే చైర్మన్‌ పీఠం దక్కుతుందంటూ రూ.వేల నుంచి రూ.లక్షల్లో పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో గురువారం బెట్టింగ్‌ల పర్వం ఊపందుకున్నట్లు సమాచారం.

గెలుపు.. మాదే1
1/1

గెలుపు.. మాదే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement