నేడు ఆర్టీసీ అభివృద్ధిపై మేథోమధనం
ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ సంస్థ, ఖమ్మం రీజియన్ ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేయడం, ఆదాయం వృద్ధి, వ్యయ నియంత్రణ మార్గాలపై చర్చించేందుకు శుక్రవారం మేధో మథనం నిర్వహిస్తున్నట్లు రీజినల్ మేనేజర్ ఏ.సరిరామ్ తెలిపారు. ఖమ్మం కొత్త బస్టాండ్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. రీజియన్‌లోని అధికారులతో ఆదాయ వనరుల పెంపు, నిర్వహణ ఖర్చుల నియంత్రణ, యాంత్రీకరణకు అవకాశాల అన్వేషణపై చర్చించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డిపో మేనేజర్లు, ట్రాఫిక్, మెయింటెనెన్స్ సూపర్‌వైజర్లు, ఏడీసీలు, ఇతర విభాగాల ఉద్యోగులు పాల్గొంటారని ఆర్‌ఎం వెల్లడించారు.
యఽథావిధిగానే రవాణాశాఖ సేవలు
ఖమ్మంక్రైం: జిల్లాలోని రవాణాశాఖ కార్యాలయాల్లో శుక్రవారం అన్ని సేవలు యథావిధిగా కొనసాగుతాయని జిల్లా రవాణా శాఖాధికారి ధర్మపురి జగదీష్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శిక్షణకు ఉద్యోగులు వెళ్లనున్నందున శుక్రవారం సేవలకు అంతరాయం ఏర్పడుతుందని ముందుగా ప్రకటించామని తెలిపారు. కానీ ఉద్యోగులు అందుబాటులోనే ఉంటున్నందున ఎలాంటి అంతరాయం ఏర్పడదని, వాహనదారులు స్లాట్లు బుక్ చేసుకోవచ్చని డీటీఓ ఓ ప్రకటనలో వెల్లడించారు.
ఐకేపీ ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధి
తిరుమలాయపాలెం: మహిళా సంఘాల సభ్యులు వ్యాపారాలు చేసేలా రుణాలు అందిస్తూ వారి ఆర్థికాభివృద్ధికి ఐకేపీ సిబ్బంది కృషి చేయాలని డీఆర్‌డీఓ శ్రీరామ్ సూచించారు. తిరుమలాయపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఐకేపీ, ఈజీఎస్ సిబ్బందితో గురువారం నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఏపీఎంలు, సీసీలు, వీఓఏలు బాధ్యతగా పనిచేస్తూ నూతన సంఘాల ఏర్పాటు, రుణాల మంజూరు, వసూళ్లపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, సభ్యుల్లో అక్షరాస్యత పెంపునకు పాటుపడాలని తెలిపారు. కాగా, ఉపాధి హామీ పథకం ద్వారా అవసరమైన కూలీలకు పని కల్పించాలని, ఎండలు పెరుగుతున్నందున పని ప్రదేశాల్లో టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అలాగే, నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ఫీల్డ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యత తీసుకోవాలని తెలిపారు. అనంతరం పొదుపు సంఘాల మహిళలకు బ్యాగ్‌ల తయారీ శిక్షణను డీఆర్‌డీఓ పరిశీలించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఎస్.కే.సిలార్ సాహెబ్, తదితరులు పాల్గొన్నారు.
భూగర్భజలాల
పెంపునకు కృషి
ఖమ్మంలీగల్: వర్షపు నీటిని ఒడిసి పట్టేలా ఇంటింటా ఇంకుడు గుంతలు నిర్మించి భూగర్భ జలాల పెంపులో అందరూ పాలుపంచుకోవాలని జిల్లా జడ్జి జి.రాజగోపాల్ సూచించారు. జలమండలి అసిస్టెంట్ డైరెక్టర్, ఇంకుడు గుంతల ప్రత్యేక అధికారి జాలా సత్యనారాయణతో కలిసి గురువారం జిల్లా కోర్టు ప్రాంగణంలో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం స్వేచ్ఛ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకుడు చల్లా కోటయ్య ఆధ్వర్యాన ఏర్పాటుచేసిన అవగాహన సదస్సులో జిల్లా జడ్జి రాజగోపాల్, ఏడీ సత్యనారాయణ మాట్లాడారు. అన్ని ఇళ్లు, కార్యాలయాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మిస్తే నీటి వనరులకు ఇక్కట్లు ఎదురుకావని చెప్పారు. ఈమేరకు సలహాల కోసం 99899 85102(సత్యనారాయణ), 98666 31720(డాక్టర్ డి.రమేష్‌కుమార్)ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు తాళ్లూరి దిలీప్‌చౌదరి, వెంకట్‌గుప్తా, నేరెళ్ల శ్రీనివాస్, కొల్లి సత్యనారాయణ, ఎం.నిరంజన్‌రెడ్డితో పాటు డాక్టర్ టి.సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
నేడు ఆర్టీసీ అభివృద్ధిపై మేథోమధనం


